రాహుల్ మాటల్లో తప్పేముంది?.. సుప్రీం కోర్టు జడ్జి కామెంట్లను ఖండించిన ఇండియా కూటమి నేతలు

రాహుల్ మాటల్లో తప్పేముంది?.. సుప్రీం కోర్టు జడ్జి కామెంట్లను ఖండించిన ఇండియా కూటమి నేతలు
  • ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్​కు ఉంటది
  • రాహుల్​పై సుప్రీం కోర్టు జడ్జి కామెంట్లను ఖండించిన ఇండియా కూటమి నేతలు
  • రాజకీయ పార్టీల హక్కులను పరిమితం చేసే కుట్ర జరుగుతున్నది
  • దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని కామెంట్

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ నేత రాహుల్‌‌‌‌ గాంధీపై సుప్రీం కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని ఇండియా కూటమిలోని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందంటూ భారత్‌‌‌‌ జోడో యాత్ర సమయంలో రాహుల్ చేసిన కామెంట్లలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశాయి. జాతీయ స్థాయిలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్ పార్టీలకు ఉంటాయని చెప్పాయి. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా చేసిన కామెంట్లపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆఫీస్​లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ మీటింగ్​కు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. జస్టిస్ దీపాంకర్ దత్తా చేసిన కామెంట్లపై చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. రాహుల్​ను ఉద్దేశిస్తూ జస్టిస్ దీపాంకర్ దత్తా చేసిన కామెంట్లు చూస్తే.. రాజకీయ పక్షాల హక్కులను పరిమితం చేసే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జిగా గౌరవప్రదమైన హోదాలో ఉంటూ అసాధారణమైన, అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాన్ని నిలదీయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. దేశ సరిహద్దులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే.. నిలదీసే హక్కు ప్రతి పౌరుడు, రాజకీయ నాయకుడికి ఉంటుందని తెలిపారు. ఇది నైతిక బాధ్యత కూడా అని పేర్కొన్నారు. 

నిజమైన భారతీయుడికి నిర్వచనం ఎవరిస్తరు?

నిజ‌‌‌‌మైన భార‌‌‌‌తీయుడు ఎవ‌‌‌‌ర‌‌‌‌న్న దానికి నిర్వచనం ఎవ‌‌‌‌రు ఇస్తార‌‌‌‌ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ఇండియా కూటమి నేతల భేటీ తర్వాత పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్​లో పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్​లో ప్రశ్నలు వేస్తే స‌‌‌‌మాధానం ఇవ్వడం లేదని, కానీ పార్లమెంట్ బ‌‌‌‌య‌‌‌‌ట మాట్లాడితే జాతి వ్యతిరేకులమని ముద్ర వేస్తున్నారని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఇలాంటి సంద‌‌‌‌ర్భంలో నిజ‌‌‌‌మైన భార‌‌‌‌తీయుడికి నిర్వచనం ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. తామే నిజ‌‌‌‌మైన భార‌‌‌‌తీయుల‌‌‌‌మ‌‌‌‌ని, అందుకే దేశం త‌‌‌‌ర‌‌‌‌పున ప్రశ్నలు వేస్తున్నామ‌‌‌‌న్నారు. 

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ భద్రత, సరిహద్దు సమస్యలపై ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించే ఉద్దేశంతో చేసినవని, అవి అవమానకరమైనవి కాదని తేల్చి చెప్పారు. జాతీయ సమస్యలను లేవనెత్తడం ప్రతిపక్షాల బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. జస్టిస్ దీపాంకర్ చేసిన కామెంట్లు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. చైనా చొరబాటుపై రాహుల్ చేసిన ఆరోపణలను ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు జడ్జి చేసిన కామెంట్లు.. సమాజంలో తప్పుడు సందేశాలు వెళ్తాయన్నారు. రాజకీయపక్షాల ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే అభివర్ణించారు. ఇండియా సరిహద్దులోని భూమిని చైనా ఆక్రమించిందని, ఇది నిజమని, దీన్ని ఏ దేశభక్తుడు.. భారతీయుడు కాదనలేడని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు.