
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూన్ 9న ఎర్రకోటపై జెండా ఎగరవేస్తామని చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మే 28వ తేదీ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. సోనియా గాంధీతో భేటీ అయ్యారు. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కావాలని కోరారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుతున్న వేడుక. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ తప్పకుండా వస్తానన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని సత్కరించబోతున్నాం. ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాం. ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తున్నాం. కేంద్రంలో ఇండియా కూటమి గెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ అన్ని అబద్ధాలే చెబుతున్నారు. కేరళ, తమిళనాడులో బీజేపీకి డిపాజిట్ రాదు. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. బీజేపీని ఓడించేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారు" అని చెప్పారు.