అన్యాయంపై పోరాడ్తం.. కూటమి ఐక్యంగా ముందుకెళ్తుంది: రాహుల్

అన్యాయంపై పోరాడ్తం.. కూటమి ఐక్యంగా ముందుకెళ్తుంది: రాహుల్
  • బెంగాల్​లోకి న్యాయ్ యాత్ర.. టీఎంసీ దూరం
  • బీహార్​లో నితీశ్ కుమార్​ వచ్చుడు కూడా డౌటే..

కూచ్ బెహర్ (బెంగాల్) : దేశంలో అన్యాయం జరుగుతున్నదని, దానిపై ఇండియా కూటమి నేతలందరం కలిసి పోరాడతామని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ లోకి ఎంటర్ అయింది. కూచ్ బెహర్ జిల్లాలో రాహుల్ యాత్రకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధురి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో రాహుల్ మాట్లాడారు. ‘‘మన దేశంలో అన్యాయం జరుగుతున్నది. అందుకే ఈ యాత్రకు న్యాయ్ యాత్ర అని పేరు పెట్టాం. దేశంలో జరుగుతున్న అన్యాయంపై ఇండియా కూటమి పోరాడుతుంది” అని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేసిన తెల్లారే... తామందరం కలిసికట్టుగా అన్యాయంపై పోరాడుతామంటూ రాహుల్ చెప్పడం గమనార్హం. కాగా, బెంగాల్ లోని ఆరు జిల్లాలు, ఆరు లోక్ సభ నియోజకవర్గాల మీదుగా 523 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర సాగనుంది. అయితే యాత్రకు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించుకుంది.

ఈ నెల 29న బీహార్​లోకి ఎంట్రీ..  

రాహుల్ యాత్ర ఈ నెల 29న బీహార్​లోకి ఎంటర్ కానుంది. యాత్రలో పాల్గొనాలని జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు కాంగ్రెస్ లీడర్ షకీల్ అహ్మద్ ఖాన్ ఆహ్వానం అందజేశారు. కానీ ఈ యాత్రకు నితీశ్ హాజరుకావడం లేదని తెలిసింది. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఆలస్యం చేస్తుండడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కు కూడా కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. ఆయన యాత్రలో పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.