
చెన్నై:సిమెంట్ బస్తా రేటును వచ్చే నెలలో రూ. 55 చొప్పున పెంచనున్నట్లు ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ వెల్లడించారు. మూడు దశలలో ఈ రేటు పెంపుదలను అమలులోకి తేనున్నట్లు చెప్పారు. కంపెనీకి ఉన్న 26 వేల చదరపు అడుగుల స్థలంలో కొంత మేర అమ్మి, నగదు సమకూర్చుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ డబ్బుతో కొన్ని అప్పులు తీర్చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ల మెరుగుదల కోసం కూడా ఈ ఫండ్స్ వాడుకుంటామని చెప్పారు. సిమెంట్ బస్తా రేటును జూన్ 1 న రూ. 20, జూన్ 15 న మరో రూ. 15, ఆ తర్వాత జులై 1 న ఇంకో రూ. 20 చొప్పున పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ముడి సరుకుల రేట్లు ఎక్కువవ్వడం, ఉత్పత్తి ఖర్చు పెరగడంతో రేట్లను పెంచుతున్నామని అన్నారు. మిగిలిన కంపెనీలతో తమను పోల్చవద్దని చెప్పారు. రేట్లు పెంచకపోతే కంపెనీ నష్టాలపాలవుతుందని స్పష్టం చేశారు. రేట్ల పెంపు ప్రభావం అమ్మకాలపై పడదని శ్రీనివాసన్ పేర్కొన్నారు. 75 ఏళ్ల నుంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తుండటంతో అమ్మకాలు తగ్గవని అభిప్రాయపడ్డారు. 2021 లో రూ. 551 కోట్ల అప్పులు తీర్చామని, ఈ ఏడాది మరో రూ. 500 కోట్లు తీర్చేస్తామని చెప్పారు.
క్యూ4లో 23.71 కోట్ల నష్టం...
ఇదిలా ఉంటే నాలుగో క్వార్టర్లో ఇండియా సిమెంట్స్‌కు రూ. 23.71 కోట్ల నష్టం వచ్చింది. ఉత్పత్తి ఖర్చు పెరగడానికి తోడు, అమ్మకాల పరిమాణం కొంత తగ్గడం వల్లే కంపెనీ నష్టాలపాలయింది. అంతకు ముందు ఏడాది క్యూ4లో కంపెనీకి రూ. 71.63 కోట్ల లాభం వచ్చింది.