ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన వైట్ ఫంగస్

ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన వైట్ ఫంగస్
  • పేగులకు రంధ్రాలు చేసిన ఫంగస్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైట్ ఫంగస్ కేసు వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ 49 ఏళ్ల మహిళకు వైద్యులు జరిపిన పరీక్షల్లో కొత్త రకం ఫంగస్ కనిపించింది. ఇంత వరకు ఎన్నడూ చూడని ఫంగస్ ఇన్ ఫెక్షన్ కావడంతో అనుమానంతో మరింత క్షుణ్ణంగా పరీక్షలు చేయగా వైట్ ఫంగస్ అని తేలింది. ఈ ఇన్ ఫెక్షన్ వల్ల బాధితురాలి జీర్ణ కోశంలో చిల్లులు పడినట్లు డాక్టర్లు గుర్తించారు. 
అసలే సునామీలా స్వైర విహారం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రంగా పోరాడుతున్న సమయంలో కొత్త  కొత్త ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడుతున్న వేళ ఫంగల్ ఇన్ఫెక్షన్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బయటపడిన బ్లాక్ ఫంగస్ కేసులు 12 వేలకు చేరుకున్న తరుణంలో వైట్ ఫంగస్ కూడా వెలుగులోకి రావడం మరింత గుబులు రేపుతోంది. ఢిల్లీలో ఈనెల 13న ఆసుపత్రిలో చేరిన మహిళకు సోకిన వైట్ ఫంగస్ ప్రపంచంలోనే మొదటి కేసు అని వైద్యులు పేర్కొంటున్నారు. 
ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ అమిత్ అరోరా మీడియాతో మాట్లాడుతూ బాధిత మహిళకు సిటీ స్కాన్ చేయగా పేగులకు రంధ్రాలు పడినట్లు తేలిందన్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి బాధితురాలి అన్నవాహిక చిన్న పేగు, పెద్దపేగులలోని రంధ్రాలను మూసివేశామన్నారు. స్టెరాయిడ్లు వాడకం వల్ల పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులకు భిన్నంగా వైట్ ఫంగస్ కేసులో పేగుల్లో రంధ్రాలు ఏర్పడిన కేసు బహుశా ప్రపంచంలోనే మొదటిదని అన్నారు.