ఒత్తిడికి మేం తలొగ్గం..ట్రంప్ ‘రష్యా ఆంక్షల చట్టం’పై భారత్   

ఒత్తిడికి మేం తలొగ్గం..ట్రంప్ ‘రష్యా ఆంక్షల చట్టం’పై భారత్   

న్యూఢిల్లీ: ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గదని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ‘రష్యా ఆంక్షల బిల్లు’పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఇంధనం ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుందని స్పష్టంచేశారు.

‘‘మా ప్రభుత్వానికి ప్రజలే అత్యున్నత ప్రాధాన్యం. ఏ నిర్ణయమైనా ప్రజలకు మేలు చేసేందుకే తీసుకుంటాం” అని ఆయన తెలిపారు. ఏకపక్షంగా విధించే సుంకాలు అన్యాయమని, ఏ ఇతర దేశం ఒత్తిడికీ భారత్ తలవంచబోదన్నారు. కాగా, అమెరికా తెచ్చిన ‘రష్యా ఆంక్షల చట్టం’ తర్వాత జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దేశ ఇంధన భద్రత, వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాల  పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం తెలిపింది.

ప్రతిఘటనే ఏకైక మార్గం: కాంగ్రెస్

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో బెదిరింపులకు లొంగిపోరాదని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ‘‘బెదిరింపులను ఎదుర్కొనేందుకు గట్టిగా ప్రతిఘటించడమే ఏకైక మార్గం” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ సూచించారు.