
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో 25 ఏళ్లు పాటు ఏడాదికి సగటున 7 శాతం గ్రోత్ రేటు సాధించినా దేశ జీడీపీ 2047 నాటికి 17 ట్రిలియన్ డాలర్ల (రూ.1,360 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని ఆర్థిక వేత్తలు, ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీ సుమారు 3 ట్రిలియన్ డాలర్లు (రూ.240 లక్షల కోట్లు) గా ఉంది. జీడీపీ వృద్ధి రేటు పెరిగితే ఎకానమీ ఇంకా ఎక్కువ పెరగొచ్చు కూడా. గ్లోబల్‌గా ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న ఇండియా, ఇంకో 25 ఏళ్లలో నాలుగో స్థానానికి చేరుకోగలదని ఎనలిస్టులు అంటున్నారు.
అతిపెద్ద కన్జూమర్ మార్కెట్ అయిన ఇండియాకు గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా కూడా తయారయ్యే సామర్ధ్యం ఉందని చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ వాటా దేశ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ= జీడీపీ+రాయితీలు– ట్యాక్స్‌లు) లో 27 శాతానికి చేరుకుంటుందని అంచనావేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ ఇనీషియేటివ్‌తో దేశంలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ మరింతగా విస్తరించనుంది. అంతేకాకుండా వివిధ సెక్టార్‌లలో అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీయల్ కారిడార్లు, మెగా టెక్స్‌టైల్ పార్కులు, దశల వారీగా అమలవుతున్న మాన్యుఫాక్చరింగ్ ప్రోగ్రామ్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెరిగిన డిమాండ్, తీర ప్రాంతాల్లో డెవలప్ చేస్తున్న ఎకనామిక్ జోన్‌లు..ఇవన్నీ దేశ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌ను మరింతగా విస్తరించడంలో సాయపడతాయి.
2021–22 లో దేశ గ్రాస్ వాల్యూ యాడెడ్‌లో తయారీ రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఈ నెంబర్ ఆర్థిక సంవత్సరం 2030–31 నాటికి 25 శాతానికి, 2047–48 నాటికి 27 శాతానికి చేరుకుంటుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ఎకానమీలో ఒక సెక్టార్ కంట్రిబ్యూషన్‌ను జీవీఏ లెక్కిస్తుంది. వీటికి అదనంగా ప్రభుత్వం అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ కోసం నేషనల్ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఈ పాలసీ వలన సప్లయ్ చెయిన్ మెరుగుపడి గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఇండియా ఎదిగే అవకాశాలు పెరుగుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ఈ పాలసీ కింద దేశ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ వాటాను జీడీపీలో 25 శాతానికి పెంచాలని, ఇంకో పదేళ్లలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగా పీపీపీ ద్వారా జరిగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. అంతేకాకుండా అవసరమయ్యే పాలసీ ఫ్రేమ్ వర్క్‌ను రెడీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందేలా చేయడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. మరోవైపు యువత స్కిల్స్ పెంచడంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని, కంపెనీలకు రాయితీలు కూడా ఇవ్వాలని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
చైనా నుంచి బయటకొచ్చేస్తున్న కంపెనీలను ఇండియా ఆకర్షించాలని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చైనా అమలు చేస్తున్న విధానాలతో మాన్యుఫాక్చ రింగ్ కంపెనీలు ఈ దేశానికి వెలుపల తమ సెకెండ్ బేస్‌ను డెవలప్ చేసుకుంటున్నాయి. ఈ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలను ఇండియా ఆకర్షించగలదని ఎనలిస్టులు భావిస్తున్నారు. దేశ జీడీపీ నిలకడగా పెరుగుతోందని, కన్జూ మర్ మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోందని, పారదర్శకమైన పాలసీలు అమల్లోకి వస్తే చైనా నుంచి బయటకొచ్చే మాన్యుఫాక్చరింగ్ కంపెనీలను మనం ఆకర్షించగలమని వివరించారు. 2047 నాటికి నాలుగో అతిపెద్ద ఎకానమీగా దేశం ఎదగగలదని, గ్లోబల్ జీడీపీలో మన దేశ వాటా 15 శాతానికి చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్‌కు అనువైన మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా నిలుస్తోంది. దీంతో దేశ తయారీ రంగం ఎగుమతులు 2030 నాటికి ట్రిలియన్ డాలర్‌కు చేరుకోగలవని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో వ్యాపారం చేసుకోవడం మరింత సులువుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నేరాలను డీక్రిమినలైజ్ (తక్కువ శిక్ష పడేలా) చేస్తోంది. కొన్ని కీలకమైన సోషల్–ఎకనామిక్ ఇండికేటర్లను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో విశ్లేషిస్తోంది. దేశ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల పోటీతత్వాన్ని, సామర్ధ్యాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై ఇండియా ఫోకస్ తక్కువగా ఉండడంతో దేశ మాన్యుఫా క్చరింగ్ సామర్ధ్యం పెద్దగా పెరగడం లేదు. దేశంలో విద్య, ఆరోగ్య విధానాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని, అప్పుడే ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉండడంతో దేశంలో ప్రజలు చేసే వినియోగం షార్ట్ టెర్మ్‌లో తగ్గిపోవచ్చని అంటున్నాయి.