ఆఫ్గాన్ ను చిత్తు చేసిన భారత్ 

ఆఫ్గాన్ ను చిత్తు చేసిన భారత్ 

ఆఫ్గనిస్థాన్ పై భారత్ భారీ విజయం సాధించింది. 101 రన్నుల తేడాతో గెలిచి గత రెండు మ్యాచుల ఓటమి నుంచి భారత్ బయటపడింది. పాకిస్థాన్, శ్రీలంకతో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన భారత్ కు ఈ మ్యాచ్ విజయం కాస్త రిలీఫ్ ఇచ్చింది. 

ఆసియా కప్ లో భాగంగా ఇవాళ జరిగిన  సూపర్ ఫోర్ మ్యాచ్ లో ఇండియా, ఆఫ్గనిస్థాన్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకొంది. ఇక బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 41 బంతుల్లో 62 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 6 రన్స్ మాత్రమే చేసి ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్... ఎక్కువ కోహ్లీకి బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. పంత్ 20 , కోహ్లీ 122 పరుగులతో అజేయంగా నిలవగా రెండు వికెట్ల నష్టానికి భారత్ 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గనిస్థాన్ ఆటగాళ్లలో ఒక్క ఇబ్రహీం జర్దాన్ మాత్రమే ఆకట్టుకునేలా ఆడాడు. 59 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రషీద్ ఖాన్ 15, ముజీబ్ 18 పరుగులు చేసి ఇబ్రహీం తర్వాతి స్థానంలో నిలిచారు. మొత్తం 20 ఓవర్లు ఆడిన ఆఫ్గనిస్థాన్... 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొంది.

కోహ్లీ సూపర్ సెంచరీ...

 మొన్న పాకిస్థాన్ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఇవాళ కూడా తన ఫామ్ ను కొనసాగించాడు. కేవలం 53 బంతుల్లో సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. మొత్తం 61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇండియా 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ 122 పరుగుల్లో 84 రన్స్ బౌండరీ (ఆరు 6, 12 ఫోర్లు) రూపంలో వచ్చాయి. ఇక 200 స్క్రైక్ రేట్ తో ఆఫ్గానిస్థాన్ బౌలర్లను  కోహ్లీ ఊచకోత కోశాడు. 1020 రోజుల (దాదాపు మూడేళ్లు ) తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు.

ఆఫ్గాన్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చిన భువీ...

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్థాన్ ను.. భారత్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్లు హజ్రాతుల్ల జజాయి, రహ్మతుల్లా గుర్బాజ్ ను డకౌట్ చేసి ఆఫ్గాన్ ఓటమికి దారులు వేశాడు. అనంతరం కరీం జన్నత్, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్ జాహీ వికెట్లు పడగొట్టి ఇండియా విజయాన్ని లాంఛనం చేశాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన భువీ... 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. భువీ దెబ్బకు ఆఫ్గాన్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.