న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు మరోసారి భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది. టెర్రరిస్ట్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, ఇతర దౌత్య సిబ్బందిని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అనుమానితుల జాబితాలో చేర్చింది. దీంతో కెనడా ప్రభుత్వ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ మర్డర్ కేసులో భారత దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొనడంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఇండియన్ గవర్నమెంట్ సీరియస్ అయ్యింది. హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ 36 సంవత్సరాల అనుభవం కలిగిన భారతదేశం యొక్క అత్యంత సీనియర్ దౌత్యవేత్త.. గతంలో ఆయన జపాన్, సూడాన్‌లలో భారత రాయబారిగా పని చేశారు. ఇటలీ, టర్కీ, వియత్నాం, చైనాలలో కూడా సేవలందిస్తున్నారు.
అలాంటి వ్యక్తిపై కెనడా ప్రభుత్వం ధిక్కారంతో వ్యవహరించడం సరికాదని కెనడా ప్రభుత్వానికి భారత్ చురకలంటించింది. హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మపై కెనడా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్రం కన్నెర్రజేసింది. ప్రధాని ట్రూడో చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశంపై దుమ్మెత్తిపోసే వ్యూహంగా భారత్ అభివర్ణించింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. భారత అధికారులపై కెనడా అసత్య ఆరోపణలు చేయడంతో ఢిల్లీలోని కెనడా రాయబారికి కేంద్రం ప్రభుత్వం ఇవాళ (అక్టోబర్ 14) సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగానే.. భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కెనడాలో ఉన్న భారత హై కమిషనర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఇవాళ (అక్టోబర్ 14) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజ్జర్ హత్య కేసులో హై కమిషనర్ సంజయ్ వర్మ, ఇతర దౌత్య అధికారులను కెనడా అనుమానితులుగా పేర్కొనడంతో ఆ దేశంలో వారికి భద్రత లేదని.. అందుకే భారత హై కమిషనర్‌ను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత కెనడియన్ ప్రభుత్వ నిబద్ధతపై మాకు విశ్వాసం లేదని.. ట్రూడో ప్రభుత్వ చర్యలు భారత అధికారుల భద్రతకు హాని కలిగిస్తాయని భారత్ పేర్కొంది.
ఈ మేరకు భారత హై కమిషనర్‌కు సమాచారం అందించిన కేంద్ర ప్రభుత్వం.. వెంటనే కెనడా నుండి తిరిగి రావాలని ఆదేశించింది. దీంతో మరోసారి భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. కాగా, ఖలిస్థానీ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. నిజ్జర్ మర్డర్ వెనక భారత్ హస్తం ఉందని మొదటి నుండి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.