Pakistani ships:పాకిస్తానీ నౌకలపై భారతదేశం నిషేధం..

Pakistani ships:పాకిస్తానీ నౌకలపై భారతదేశం నిషేధం..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు చెందిన నౌకలను భారత్ తో ప్రవేశించకుండా నిషేధించింది. పాకిస్తాన్ జెండా ఉన్న  ఓడలు ఏ భారతీయ ఓడరేవులోకి రావొద్దని ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  మరోవైపు పాకిస్తాన్ నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల ఇన్ బౌండ్ మెయిల్, పార్శిళ్ల ఎక్ఛేంజ్ ను నిలిపివేయాలని నిర్ణయించింది. శనివారం ( మే 3) నుంచి అన్ని రకాల ఇన్ బౌండ్ మెయిల్ ఎక్ఛేంజ్ ని నిలిపివేస్తున్నట్లు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కేంద్రం నిషేధం..జీరోకు దిగుమతులు 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పెరుగుతున్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి, రవాణాపై భారత్ తక్షణ నిషేధం విధించింది.  దీంతో పాకిస్తాన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. రెండు దేశాలమధ్య ప్రస్తుతం 0.5మిలియన్ల  డాలర్ల ట్రేడింగ్ జరుగుతోంది. అధికారిక డేటా ప్రకారం ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 మధ్య కాలంలో పాక్ నుంచి భారత్ 4లక్షల 20వేల డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుందని తేలింది. ఇందులో పండ్లు, సిమెంట్ సహా అనేక ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. 

ఇవన్నీ ఇప్పుడు నిలిపివేయబడ్డాయి. దీంతో భారత్ , పాక్ మధ్య 0.5మిలియన్ల డాలర్ల ట్రేడింగ్ సున్నాకు పడిపోతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ఫౌండర్ అజయ్ శ్రీ వాస్తవ అన్నారు. గత రెండు వారాలుగా భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దిగజారుతున్న నేపథ్యంలో భారతదేశం తీసుకున్న ఈ చర్య మరో తాజా నిర్ణయం.