గ్లోబల్ సమస్యలున్నా ఇండియా దూసుకుపోతోంది

గ్లోబల్ సమస్యలున్నా ఇండియా దూసుకుపోతోంది
  • ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రభుత్వ చర్యలే కారణం
  • 2024–25 లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పనితీరు అదిరిపోయింది: నిర్మలా సీతారామన్‌‌‌‌

ముంబై:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా జీడీపీ 7.8శాతం వృద్ధి సాధించిందని, గ్లోబల్‌‌‌‌గా సమస్యలున్నా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే విషయం దీనిని బట్టి అర్థమవుతోందని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.  పుణేలో జరిగిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  91వ స్థాపన దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.   ఈ వృద్ధికి ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు,  ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రధాన కారణాలని చెప్పారు. కొవిడ్ తర్వాత భారత్ 8శాతం సగటు వార్షిక వృద్ధితో ప్రపంచంలో వేగంగా ఎదిగిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆమె గుర్తుచేశారు. 

జీఎస్‌‌‌‌టీ సంస్కరణలను  సామాన్యుడి కోసం తీసుకొచ్చామని అన్నారు.  బ్యాంకులు యువతలో నమ్మకం పెంచడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎస్‌‌‌‌ అండ్ పీ,  మార్నింగ్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ డీబీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్ ఐ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత క్రెడిట్ రేటింగ్‌‌‌‌ను ‘బీబీబీ’, ‘బీబీబీ+’కి పెంచినట్లు మంత్రి తెలిపారు. 

బ్యాంకులు వృద్ధికి ఇంధనంగా మారాలని అన్నారు. “బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  2024–25లో అత్యుత్తమ పనితీరు కనబరిచింది. దీని మొత్తం వ్యాపారం రూ.5.46 లక్షల కోట్లకు, డిపాజిట్లు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. రిటైల్‌‌‌‌ అడ్వాన్స్‌‌‌‌లు (అప్పులు) ఏడాది లెక్కన  35శాతం, ఎంఎస్‌‌‌‌ఎంఈ అడ్వాన్స్‌‌‌‌లు  5.65శాతం వృద్ధి సాధించాయి” అని మంత్రి వివరించారు.