
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను కొత్తగూడెం టౌన్ లోని క్లబ్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. చిన్నతనం నుంచే సురవరం సుధాకర్ రెడ్డి ప్రజా సమస్యలపై గళమెత్తారని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలే ఆయనకు ఘనమైన నివాళి అన్నారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజలపై అప్రకటిత యుద్ధం ప్రకటిస్తోందని, మతాలపై ప్రజల్లో చిచ్చు రేపుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఎం జిల్లా నేతలు అన్నవరపు సత్యనారాయణ, మాస్ లైన్ నేత ఆవునూరి మధు, సీపీఐ, కాంగ్రెస్ టీడీపీ, న్యూ డెమోక్రసీ నేతలు ముత్యాల విశ్వనాథం, నాగ సీతారాములు, పి. వీరబాబు, ముద్దా భిక్షం, ఆళ్ల మురళి, కంచర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.