దుబాయ్: ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల టీ20ఐ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. కొంతకాలంగా మైదానంలో పరుగుల వరద పారిస్తూ, అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న టీమ్ ఇండియా 275 పాయింట్లతో పట్టికలో అగ్రభాగాన నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన భారత్, ఆ జోరును ర్యాంకింగ్స్‌లోనూ ప్రదర్శిస్తోంది.
భారత జట్టు వెనుకే 262 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉండగా, 258 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. టాప్-7 జట్ల ర్యాంకింగ్స్‌లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ర్యాంకింగ్స్ పట్టికలో బంగ్లాదేశ్ జట్టు ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా, శ్రీలంక 6 పాయింట్లను కోల్పోయి 9వ స్థానానికి పడిపోయింది.
ఆప్ఘనిస్తాన్ జట్టు 220 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. మరోవైపు అమెరికా క్రికెట్ జట్టు వరుస విజయాలతో సత్తా చాటి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి దూసుకెళ్లింది. ఐసీసీ నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు.
మే 2025 నుంచి జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల వెయిటేజీని కేటాయించారు. గత మూడేళ్లలో కనీసం ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడని ఫిజీ, గాంబియా, గ్రీస్, ఇజ్రాయెల్ జట్లను ఐసీసీ ర్యాంకింగ్స్ నుంచి తొలగించింది. దీంతో ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్ల సంఖ్య 102 నుంచి 98కి తగ్గింది.---
