
- ఫైనల్లో 4–1తో కొరియాపై గ్రాండ్ విక్టరీ 2026 వరల్డ్ కప్‌కు అర్హత
రాజ్‌గిర్ (బిహార్): టోర్నీ మొత్తం ఆధిపత్యం చూపెట్టిన ఇండియా హాకీ జట్టు.. ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో ఇండియా 4–1తో డిఫెండింగ్ చాంపియన్ కొరియాపై అద్భుత విజయం సాధించింది. ఫలితంగా వచ్చే ఏడాది ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌కు అటోమేటిక్‌గా అర్హత సాధించింది. ఇండియా తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (28, 45వ ని), సుఖ్‌జీత్ సింగ్ (1వ ని), అమిత్ రోహిడాస్ (50వ ని) గోల్స్ చేయగా, డైన్ సన్ (51వ ని) కొరియాకు ఏకైక గోల్ అందించాడు. ఎనిమిదేండ్ల విరామం తర్వాత మళ్లీ ఆసియా కప్ గెలిచిన ఇండియాకు ఇది నాలుగో టైటిల్ కావడం విశేషం. 2003, 2007, 2017లో చాంపియన్‌గా నిలిచింది. ఇక మూడో ప్లేస్ కోసం జరిగిన మ్యాచ్‌లో మలేసియా 4–3తో చైనాను ఓడించింది. ఐదో ప్లేస్ మ్యాచ్‌లో జపాన్ 6–1తో బంగ్లాదేశ్‌పై గెలిచింది.
అదే జోరు..
ఈ టోర్నీలో ఐదు విజయాలు, ఒక డ్రాతో అపజయమన్నదే లేకుండా ఆడిన టీమిండియా ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. మ్యాచ్ మొదలైన 31వ సెకన్‌లోనే సుఖ్‌జీత్ సూపర్ గోల్ కొట్టాడు. స్టార్టింగ్ నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడిన ఇండియా.. కొరియా సర్కిల్‌లోకి చొచ్చుకుపోయింది. దాంతో ఈజీగా అందిన పాస్‌ను సుఖ్‌జీత్ సర్కిల్ లోపలికి తీసుకెళ్లి రివర్స్ హిట్ కొట్టాడు. అంతే బాల్ రివ్వున కొరియా గోల్ పోస్ట్‌ను ఛేదించడంతో ఇండియా 1–0 లీడ్‌లో నిలిచింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన కొరియన్లు ఎదురుదాడికి దిగినా ఇండియన్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. దాంతో రెండు వైపుల నుంచి ఫార్వర్డ్స్ మంచి సమన్వయంతో కదులుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించారు. రైట్ ఎండ్ నుంచి రాజ్‌కుమార్ పాల్ బాల్‌ను ఆధిపత్యంలో ఉంచుకున్నా గోల్స్ కొట్టలేకపోయాడు. మధ్యలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచే అవకాశం వచ్చినా జుగ్‌రాజ్ వృథా చేశాడు.
గోల్ పోస్ట్ ముందర జుగ్‌రాజ్ కొట్టిన క్రాస్ షాట్‌ను కొరియా గోల్ కీపర్ సమర్థంగా నిలువరించాడు. 1–0తో తొలి క్వార్టర్‌ను ముగించిన ఇండియా.. గ్రీన్ కార్డుతో కొన్ని నిమిషాలు జుగ్‌రాజ్ సేవలను కోల్పోయింది. అయితే రెండో క్వార్టర్ చివరలో దూరం నుంచి సంజయ్ బాల్‌ను పాస్ చేసుకుంటూ వచ్చి దిల్‌ప్రీత్‌కు అందించాడు. దీన్ని దిల్‌ప్రీత్ పవర్‌ఫుల్ గోల్‌గా మల్చడం స్కోరు 2–0కు పెరిగింది. అప్పటికే ఒత్తిడిలో పడిన కొరియన్లు మూడో క్వార్టర్‌లో దూకుడు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వరుసగా వచ్చిన పెనాల్టీలను ఇండియా గోల్ కీపర్ అడ్డుకున్నాడు.
మూడో క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్ ఇచ్చిన షార్ట్ పాస్‌ను రాజిందర్ సింగ్ కొద్దిగా టచ్ చేస్తూ దిల్‌ప్రీత్‌కు ఫార్వర్డ్ చేశాడు. అంతే వేగంతో దిల్‌ప్రీత్ బాల్‌ను గోల్ పోస్ట్‌కు పంపి ఆధిక్యాన్ని 3–0కు పెంచాడు. 50వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అమిత్ గోల్‌గా మల్చడంతో ఇండియా 4–0తో నిలిచింది. కానీ తర్వాతి నిమిషంలోనే డైన్ సన్ గోల్ కొట్టి ఆధిక్యాన్ని 4–1కి తగ్గించాడు. ఇక్కడి నుంచి గోల్స్ చేసేందుకు కొరియన్లు చేసిన ప్రయత్నాలను ఇండియన్స్ తిప్పికొట్టి చిరస్మరణీయ విజయాన్ని సాధించారు. రెండు గోల్స్ కొట్టిన దిల్‌ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.