IND vs WI: బుమ్రాకు రెస్ట్.. కరుణ్‌ ఔట్.. అయ్యర్ డౌట్: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్‌పై క్లారిటీ!

IND vs WI: బుమ్రాకు రెస్ట్.. కరుణ్‌ ఔట్.. అయ్యర్ డౌట్: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్‌పై క్లారిటీ!

ఒకవైపు ఆసియా కప్ ఆడుతూ టీమిండియా బిజీగా ఉంటే మరోవైపు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యే జట్టుపై ఆసక్తి నెలకొంది. వెస్టిండీస్ తో సిరీస్ టెస్ట్ సిరీస్ కోసం భారత స్క్వాడ్ ను సెప్టెంబర్ 23 లేదా 24న జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలియజేసిన సంగతి తెలిసిందే. మంగళవారం (సెప్టెంబర్ 23) స్క్వాడ్ రాకపోవడంతో బుధవారం (సెప్టెంబర్ 24) జట్టును ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ తర్వాత స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం విశేషం. 15 మందితో కూడిన భారత స్క్వాడ్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. జట్టు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.. 

కెప్టెన్ గా శుభమాన్ గిల్ కొనసాగనున్నాడు. ఆసియా కప్ ఆడుతూ బిజీగా ఉన్న గిల్ వెస్టిండీస్ తో తొలి టెస్టుకు రెస్ట్ ఇస్తారని భావించినా  అలా జరిగేల కనిపించడం లేదు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ లకు జట్టులో చోటు ఖాయం. బి సాయి సుదర్శన్ తో  పాటు ఇటీవలే ఆస్ట్రేలియా ఏ తో 150 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన పడికల్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. పడికల్ ఓపెనింగ్ తో పాటు మూడో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు. మిడిల్ ఆర్డర్ లో ఎంపికయ్యే బ్యాటర్లపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్ లో పేలవ ఆట తీరుతో నిరాశపరిచిన కరుణ్ నాయర్ కు సెలక్టర్లు గుడ్ బై చెప్పనున్నారు. 

కంబ్యాక్ ఇస్తాడనుకున్న శ్రేయాస్ అయ్యర్ చోటు అనుమానంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ తో అయ్యర్ కు గట్టి పోటీ ఉంది. వికెట్ కీపర్ గా  ధ్రువ్ జురెల్ బ్యాకప్ వికెట్ కీపర్ గా జగదీసన్ ఛాన్స్ దక్కనుంది. స్పిన్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్ టన్ సుందర్, రవీంద్ర జడేజా ఉండడం ఖాయంగా మారింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటాడు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్క్వాడ్ లో చోటు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో ఫాస్ట్ బౌలర్లుగా ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ జట్టులో స్థానం సంపాదించనున్నారు. 

►ALSO READ | Asia Cup 2025: పాకిస్థాన్, శ్రీలంకలకు అగ్ని పరీక్ష.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఫైనల్ ఛాన్స్ ఉంటుందా..?

భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధం కావడానికి విండీస్ జట్టుకు సెప్టెంబర్ 24-29 మధ్య అహ్మదాబాద్‌లో 6 రోజుల శిబిరాన్ని నిర్వహిస్తారు. మరోవైపు ఇండియా జట్టు 2025 ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఒక రోజు వ్యవధిలోనే సెప్టెంబర్ 29న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 

వెస్టిండీస్‌ సిరీస్‌కు భారత జట్టు (అంచనా):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవ్‌దత్ పడికల్, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, జగదీసన్