Asia Cup 2025: పాకిస్థాన్, శ్రీలంకలకు అగ్ని పరీక్ష.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఫైనల్ ఛాన్స్ ఉంటుందా..?

Asia Cup 2025: పాకిస్థాన్, శ్రీలంకలకు అగ్ని పరీక్ష.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఫైనల్ ఛాన్స్ ఉంటుందా..?

ఆసియా కప్ సూపర్-4 లో మంగళవారం (సెప్టెంబర్ 23) ఆసక్తికర సమరం జరగనుంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సూపర్-4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. మరోవైపు పాకిస్థాన్ జట్టును ఇండియా చిత్తు చేసింది. సూపర్-4 లో ఒక్కో జట్టు మూడు మ్యాచ్ లే ఆడుతుండడంతో ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం అవుతాయి. 

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఫైనల్ ఛాన్స్ ఉంటుందా..?

టోర్నీలో మూడు మ్యాచ్ ల్లో గెలిస్తేనే 100 శాతం ఫైనల్ కు చేరుకుంది అని చెప్పగలం. రెండు గెలిచినా.. ఒకటి గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. సూపర్-4 లో పాక్, లంక జట్లు తమ తొలి మ్యాచ్ లో ఓడిపోయాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకు కూడా ఫైనల్ ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఈ మ్యాచ్ పాకిస్థాన్ ఓడిపోయిందనుకుందాం. ఫైనల్ రేస్ లో ఉండాలంటే వారు చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారీ తేడాతో గెలిచి తీరాలి. అదే సమయంలో ఇండియా మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ  గెలిచి తీరాలి. అప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒక్కో మ్యాచ్ గెలిచి ఫైనల్ రేస్ లో ఉంటాయి. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న జట్టు ఫైనల్ కు చేరుతుంది. 

ఫేవరేట్ గా శ్రీలంక: 

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ తో పోలిస్తే శ్రీలంకనే ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక  సూపర్-4 తొలి మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్ చేతిలో 4వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓడింది. ఈ పరాజయంతో  టీ20 ఆసియా కప్‌‌లో లంక 8 మ్యాచ్‌‌ల విజయ పరంపరకు తెరపడింది. మరోవైపు, మైదానం బయటి వివాదాలు, చెత్త ఆటతో పాకిస్తాన్ జట్టు గందరగోళంలో పడింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి  ఇండియా చేతిలో చిత్తుగా ఓడటం ఆ జట్టును మరింత కుంగదీసింది.

►ALSO READ | సాకర్‌‌‌‌లోనూ పాక్‌‌పై ఇండియాదే పైచేయి..

ఈ టోర్నీలో టీమిండియా చేతిలో పాక్‌‌కు ఇది రెండో ఓటమి. తమ ఆరంభ మ్యాచ్‌‌ల్లో విజయాలు సాధించిన ఇండియా, బంగ్లా రెండేసి పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. లంక, పాక్ ఖాతా తెరవకుండా చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. కెప్టెన్ సల్మాన్ ఆగా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్ ఆడనుంది.