
కొలంబో: ఆట ఏదైనా పాకిస్తాన్‌తో మ్యాచ్ అనగానే ఇండియా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. ఆసియా కప్‌లో టీమిండియా.. పాక్‌ను కుమ్మేసిన స్ఫూర్తితో సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్–17 చాంపియన్‌షిప్‌లో దాయాది జట్టును ఇండియా కుర్రాళ్లు దెబ్బకొట్టారు. సోమవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియా3–-2 తో విజయం సాధించింది. 31వ నిమిషంలో దల్లాల్మువోన్ గాంగ్టే గోల్ చేసి ఇండియాకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే, 43వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా అబ్దుల్లా పాక్‌కు గోల్ సాధించిపెట్టాడు.
ఈ గోల్ తర్వాత అబ్దుల్లా తన తోటి ఆటగాళ్లతో కలిసి టీ తాగినట్లుగా ఒక వివాదాస్పద సైగ చేసి సెలబ్రేట్ చేసుకోవడం విమర్శలకు దారితీసింది. ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్, సాహిబ్జదా ఫర్హాన్ చేసిన కవ్వింపు చర్యలను ఇది పోలి ఉంది. పాక్ ప్లేయర్లు కవ్వింపులకు ఇండియా కుర్రాళ్లు ఆటతోనే బదులిచ్చారు. 63వ నిమిషంలో గున్‌లేబా వాంగ్‌కీరక్‌పమ్ గోల్ కొట్టాడు. ఏడు నిమిషాల తర్వాత పాక్ ఆటగాడు హమ్జా యాసిర్ 2–-2తో స్కోరు సమం చేశాడు. 73వ నిమిషంలో రహన్ అహ్మద్ అద్భుతమైన గోల్ చేసి ఇండియాకు విజయం అందించాడు.