న్యూఢిల్లీ: ఫ్యాక్టరీ ఉత్పత్తి, అమ్మకాలలో పదునైన పెరుగుదల, డిమాండ్ వల్ల భారతదేశ తయారీ రంగం వృద్ధి ఫిబ్రవరిలో ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కాలానుగుణంగా సర్దుబాటు చేసే మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5 నుంచి ఫిబ్రవరిలో 56.9కి పెరిగింది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో, 50 కంటే ఎక్కువ ప్రింట్ అంటే విస్తరణ అని అర్థం కాగా, 50 కంటే తక్కువ అయితే స్కోర్ సంకోచించినట్టు భావించాలి.
సర్వే ప్రకారం, ఉత్పత్తి గత ఐదు నెలల్లో అత్యంత వేగంతో పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అమ్మకాలు వేగంగా పెరగడానికి 21 నెలల పాటు కొత్త ఎగుమతి ఆర్డర్లు కారణం. దేశీయ, విదేశీ డిమాండ్ రెండింటి మద్దతుతో ఉత్పత్తి వృద్ధి బలంగా కొనసాగిందని హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్త ఇనెస్ లామ్ అన్నారు. వృద్ధి ఊపందుకున్నప్పటికీ తయారీ రంగంలో ఉపాధి పెరగలేదు. ఇన్‌పుట్ ధరల ద్రవ్యోల్బణం జులై 2020 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయినందున తయారీ సంస్థల మార్జిన్‌లు మెరుగుపడ్డాయని లామ్ చెప్పారు. బలమైన దేశీయ డిమాండ్‌తో పాటు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, కెనడా, చైనా, యూరప్, ఇండోనేషియా, అమెరికా తదితర దేశాల నుంచి కొత్త ఎగుమతి ఆర్డర్లు వేగంగా పెరిగాయి.
