
- 2038 నాటికి చేరుకుంటుందన్న ఈవై
- ప్రస్తుతం 14.2 ట్రిలియన్ డాలర్లతో మూడో ప్లేస్‌లో
- సరియైన చర్యలతో అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని ఇండియా జీడీపీలో 0.1 శాతానికి పరిమితం చేయొచ్చు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 20.7 ట్రిలియన్ డాలర్లకు (పర్చేజింగ్ పవర్ పారిటీ– పీపీపీ ) స్థాయికి చేరే అవకాశం ఉందని, 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగొచ్చని అకౌంటింగ్ కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. అమెరికా విధించిన అధిక టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు సరైన చర్యలు తీసుకుంటే, జీడీపీ వృద్ధిపై పడే ప్రభావం కేవలం 0.1 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఈవై ఎకానమీ వాచ్ (ఆగస్టు 2025) రిపోర్ట్ ప్రకారం, భారత్ ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా ఉంది.
ఆకర్షణీయమైన సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్ రేట్లు, అధిక జనాభా, స్థిరమైన ఆర్థిక స్థితి ఉండడం కలిసొస్తోంది 2030 నాటికి చైనా 42.2 ట్రిలియన్ డాలర్ల(పీపీపీ)తో ముందుండే అవకాశం ఉన్నప్పటికీ, వృద్ధాప్య జనాభా, అధిక అప్పు వంటి సవాళ్లను ఈ దేశం ఎదుర్కోవచ్చు. అమెరికా బలంగా ఉన్నప్పటికీ, జీడీపీకి 120శాతం మించి అప్పు ఉండటం, వృద్ధి మందగించడం వంటి సమస్యలు ఉన్నాయి. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో యువత తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యంపై అతిగా ఆధారపడటం వంటి సవాళ్లు ఎదుర్కోవచ్చు.
దేశీయ డిమాండ్‌తో సవాళ్లు దాటొచ్చు
గ్లోబల్‌గా ఆర్థిక ఒత్తిళ్లు పెరిగినా, దేశీయ డిమాండ్, ఆధునిక టెక్నాలజీలో సామర్ధ్యం పెంచుకోవడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చని ఈవై అభిప్రాయపడింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రకారం, కిందటి ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ (పీపీపీ) 14.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని బట్టి భారత్ ఇప్పటికే అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2030 తర్వాత భారత్ 6.5శాతం, అమెరికా 2.1శాతం వృద్ధి సాధిస్తే, 2038 నాటికి పీపీపీ ప్రమాణంలో అమెరికాను అధిగమించే అవకాశం కూడా ఉంది.
ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ మాట్లాడుతూ, “ఇండియాలో యువత, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, బలమైన సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ రేట్లు , నిలకడైన అప్పులు వంటి సానుకూల అంశాలు ఉన్నాయి. దీంతో గ్లోబల్‌గా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా ,ఇండియా తన వృద్ధిని కొనసాగించగలదు. కీలక సాంకేతికతలలో సామర్థ్యాన్ని పెంచుతూ, భారత్ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి చేరువవుతోంది” అని అన్నారు. అమెరికా టారిఫ్‌ల ప్రభావం జీడీపీలో 0.9శాతం వరకు ఉండొచ్చని ఈవై తెలిపింది. ఎగుమతుల విస్తరణ, దేశీయ డిమాండ్ పెంపు, ఎఫ్‌టీఏలతో జీడీపీపై ప్రభావాన్ని 0.1 శాతానికి పరిమితం చేయొచ్చని పేర్కొంది.