త్వరలో మరిన్ని బ్యాంకులు .. కొత్త బ్యాంకింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు జారీ చేసే ఆలోచనలో ప్రభుత్వం

త్వరలో మరిన్ని బ్యాంకులు .. కొత్త బ్యాంకింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు జారీ చేసే ఆలోచనలో ప్రభుత్వం
  • పెద్ద ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలను పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చే అవకాశం
  • తయారీ, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌ లోన్లు ఇచ్చేవి కావాలి
  • బ్యాంకింగ్ రంగం విస్తరిస్తేనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఇండియా

న్యూఢిల్లీ: ఇండియాలో దాదాపు పదేళ్ల తర్వాత కొత్త బ్యాంకింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు జారీ కానున్నాయని న్యూస్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్  రిపోర్ట్ చేసింది.  ఆర్థికవ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించే మార్గాలను ఫైనాన్స్ మినిస్ట్రీ,  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ) అధికారులు చర్చిస్తున్నారని తెలిపింది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ రిపోర్ట్ ప్రకారం, పెద్ద కంపెనీలకు షేర్‌‌‌‌‌‌‌‌హోల్డింగ్‌‌‌‌‌‌‌‌పై ఆంక్షలతో బ్యాంకింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ల కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతించడం, నాన్-బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీల)ని పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చడం, ప్రభుత్వ బ్యాంకులలో విదేశీ పెట్టుబడిదారుల వాటాను పెంచేందుకు రూల్స్‌‌‌‌‌‌‌‌ సులభతరం చేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. 

ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ నుంచి ఇంకా అధికారికంగా  ఎటువంటి ప్రకటనలు రాలేదు.  అయితే, మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దీని  ప్రభావం కనిపించింది. నిఫ్టీ పీఎస్‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్ ఇండెక్స్ శుక్రవారం ఇంట్రాడేలో  0.80 శాతం నష్టపోగా, చివరికి 0.5శాతం లాభంతో ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు  8శాతం పెరిగింది.  చివరిసారిగా 2014లో బ్యాంకింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌లను ప్రభుత్వం జారీ చేసింది. 2016లో పెద్ద వ్యాపార గ్రూపులను లైసెన్స్‌‌‌‌‌‌‌‌లకు దరఖాస్తు చేయకుండా నిషేధించింది. 

 ఈ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించే అవకాశం ఉంది. వ్యాపార గ్రూపులకు బ్యాంకులు తెరిచే అనుమతి సున్నితమైన నిర్ణయమని, షేర్‌‌‌‌‌‌‌‌హోల్డింగ్, నియంత్రణపై ఆంక్షలు ఉంటాయని బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ పేర్కొంది.  చిన్న బ్యాంకులను విలీనం చేసి పెద్ద సంస్థలను సృష్టించడం, దక్షిణ భారతదేశంలో ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలను బ్యాంకులుగా మార్చడం కూడా చర్చలో ఉన్నాయి. యాపిల్ వంటి కంపెనీలు ఈ ప్రాంతంలో  తయారీని విస్తరిస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీలకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం  చూస్తోంది.  

గ్లోబల్‌‌‌‌‌‌‌‌ లెవెల్లో మన బ్యాంకులు డల్‌‌‌‌‌‌‌‌

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ  బ్యాంక్ మాత్రమే ప్రపంచ టాప్ 100 బ్యాంకులలో చోటు దక్కించుకున్నాయి.  చైనా, అమెరికా బ్యాంకులు టాప్ 10లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగంలో రూల్స్‌‌‌‌‌‌‌‌ కఠినంగా ఉన్నాయి.   ప్రభుత్వ బ్యాంకులలో విదేశీ పెట్టుబడి 20శాతానికే పరిమితం చేశారు. ఇంకా వీటిలో విదేశీ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేయాలంటే ముందు  ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి.  ఈ రంగాన్ని విస్తరించడానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐ) పరిమితిని పెంచొచ్చని  బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్  పేర్కొంది.   ఇండియాను 2047 నాటికి  అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోనుందని తెలిపింది.  

 బ్యాంకుల్లో ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను  ప్రస్తుతం ఉన్న జీడీపీలోని 56శాతం నుంచి 130శాతానికి పెంచాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని వివరించింది.  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్ వంటి దీర్ఘకాలిక (లాంగ్‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌)  ప్రాజెక్టులకు ఎక్కువ కాలం రుణాలు అందించే బ్యాంకులు అవసరం. ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, బ్యాంకులపై నియంత్రణలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పెద్ద సైజ్‌‌‌‌‌‌‌‌ లోన్లు ఇచ్చినా ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వకుండా కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉంచొచ్చు.  

బ్యాంకింగ్ లైసెన్సింగ్ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సమీక్షిస్తున్నామని, బలమైన, విశ్వసనీయ బ్యాంకులను స్థాపించేందుకు కృషి చేస్తున్నామని గతంలో ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా  చెప్పారు.మరోవైపు  జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన సుమిటోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ ఈ ఏడాది మే నెలలో యెస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో 20శాతం వాటా కొన్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.13,500 కోట్లు (1.58 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది.  ఇది బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి.