క‌రోనా నుంచి కోలుకున్న 2 ల‌క్ష‌ల మంది పేషెంట్లు

క‌రోనా నుంచి కోలుకున్న 2 ల‌క్ష‌ల మంది పేషెంట్లు

దేశంలో క‌రోనా బారిన‌ప‌డి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,386 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య‌ 2,04,710కి చేరింది. దీంతో దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 53.79 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,80,532 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. ప్ర‌స్తుతం వేర్వేరు ఆస్ప‌త్రుల్లో 1,63,248 మంది చికిత్స పొందుతున్నారు. స‌రైన స‌మ‌యంలో అప్ర‌మ‌త్త‌మై దేశంలో లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కృషి, ప్ర‌జ‌ల స‌హ‌కారం వ‌ల్లే క‌రోనా వైర‌స్ టెస్టింగ్, మౌలిక స‌దుపాయాల‌ను వేగంగా పెంచుకుంటూ ఈ మ‌హ‌మ్మారితో పోరాటంలో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తున్నామ‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోందని, దీంతో యాక్టివ్ కేసులతో పోలిస్తే డిశ్చార్జ్ అవుతున్న వారి నిష్ప‌త్తి ఎక్కువ‌గా ఉంటోంద‌ని చెప్పింది. అలాగే ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా టెస్టుల సామ‌ర్థ్యం బాగా పెరిగింద‌ని, మొత్తంగా 960 ల్యాబ్స్‌లో ( ప్ర‌భుత్వ ల్యాబ్స్ – 703, ప్రైవేటు ల్యాబ్స్ – 257) టెస్టులు చేస్తున్నామ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,76,959 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 64,26,627 మందికి టెస్ట్ చేసిన‌ట్లు చెప్పింది.