
- 2030 నాటికి 500 బిలియన్ల డాలర్లు
- వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి పునరుత్పాదక, గ్రీన్ హైడ్రోజన్, ఈవీ వంటి క్లీన్ ఎనర్జీ వాల్యూ చైన్‌లో 500 బిలియన్ల డాలర్ల విలువైన భారీ పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇండో–-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపీఈఫ్) క్లీన్ ఎకానమీ ఇన్వెస్టర్ ఫోరమ్ రెండు రోజుల సమావేశం కోసం సింగపూర్ వచ్చిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారులను, కీలక లీడర్లను ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఏకైక వేదికగా ఫోరమ్ నిలిచిందని అన్నారు. ఇండో–--పసిఫిక్ ప్రాంతంలో స్థిరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో సులభంగా వ్యాపారం చేయడం గురించి తీసుకొచ్చిన కీలక సంస్కరణల గురించి వివరించారు. బుధవారం ప్రారంభమైన సమావేశం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, వాతావరణ సాంకేతికత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో పెట్టుబడులను సమీకరించడానికి ఈ ప్రాంతంలోని పెట్టుబడిదారులు, క్లీన్ ఎకానమీ కంపెనీలు స్టార్టప్‌లను ఒకచోట చేర్చింది. 14 మంది సభ్యుల ఐపీఈఎఫ్ బ్లాక్‌ని యూఎస్, ఇండో–-పసిఫిక్ ప్రాంతంలోని ఇతర భాగస్వామ్య దేశాలు సంయుక్తంగా మే 23, 2022న టోక్యోలో ప్రారంభించాయి.
ఎన్నో దేశాలు
ఆస్ట్రేలియా, బ్రూనై దారుస్సలాం, ఫిజీ, ఇండియా, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, అమెరికా, వియత్నాం ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. రెండు రోజుల ఈవెంట్‌లో ఆర్థిక సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లు, ప్రాజెక్ట్ యజమానులు, వ్యాపారవేత్తలు, ఐపీఈఎఫ్ భాగస్వాములు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి 300 మందికి పైగా పాల్గొన్నారు. ఫోరమ్ ఫలితంగా ఇండో–-పసిఫిక్‌లో స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 23 బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవకాశాలు లభించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశం నుంచి జపాన్‌కు 200 కేటీపీ (సంవత్సరానికి కిలోటన్నులు) గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, ఎగుమతి కోసం సెంబ్‌కార్ప్ గ్రీన్ హైడ్రోజన్ ఇండియా, క్యుషు ఎలక్ట్రిక్ సోజిట్జ్ మధ్య ఒప్పందంపై సంతకం కూడా ఈ కార్యక్రమంలో జరిగింది.