బీజింగ్: చైనాలోని షాంఘై నగరంలో ఇండియా కొత్త కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించింది. షాంఘైలోని ప్రఖ్యాత డానింగ్ సెంటర్లో 1,436.63 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనాన్ని చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఆదివారం ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ కాన్సులేట్‌తో అక్కడి భారతీయులకు, చైనా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయని ఆయన తెలిపారు.
భారత్, చైనా సంబంధాలకు 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కాన్సులేట్‌ను పాత భవనం నుంచి కొత్త భవనానికి మార్చామన్నారు. షాంఘైతోపాటు హ్యాంగ్జౌ, నింగ్బో, నాంజింగ్, యివూ, కెకియావో, సుఝౌ వంటి సిటీలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయన్నారు.
అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు ఉన్న షాంఘై సిటీ చైనాలో ఇంటర్నేషనల్ ట్రేడ్‌కు కేంద్రంగా కొనసాగుతోందని, ఇక్కడ అధునాతన కాన్సులేట్ ఏర్పాటుతో వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్, కాన్సులేట్ పరిధిలోని వివిధ నగరాలకు చెందిన భారతీయ, చైనా ప్రముఖులు, స్థానిక ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
