పాక్​పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్.! ఆ దేశాన్ని FATF ​గ్రే లిస్ట్​లో చేర్చేందుకు యత్నం

పాక్​పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్.! ఆ దేశాన్ని FATF ​గ్రే  లిస్ట్​లో చేర్చేందుకు యత్నం
  • ఆ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ ​గ్రే  లిస్ట్​లో చేర్చేందుకు యత్నం
  • ఐఎంఎఫ్​ సాయంపైనా ఆందోళనకు సిద్ధం
  • ఇండియన్​ మిలిటరీ స్ట్రైక్స్​ భయంతో 
  • పీవోకేలో మదర్సాలు క్లోజ్​
  • రెండు నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి: పీవోకేలో ప్రజలకు పాక్​ అలర్ట్


న్యూఢిల్లీ: పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్​ ఉందని అనుమానిస్తున్న భారత్​.. ఆ దేశంపై ఆర్థిక దాడికి సిద్ధమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశ ఆర్థికమూలాలను దెబ్బతీయాలని నిర్ణయించింది. ఈమేరకు రెండు ఫైనాన్షియల్​ స్ట్రైక్​లను ప్లాన్​ చేస్తున్నది. ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్​(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్​లోకి పాకిస్తాన్​ను మరోసారి తీసుకొచ్చేలా గట్టి ప్రయత్నాలు చేయాలని భారత్ యోచిస్తున్నది. అలాగే, ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​(ఐఎంఎఫ్​) నుంచి పాకిస్తాన్​కు అందుతున్న 7 బిలియన్ ​ డాలర్ల సాయంపైనా ఆందోళన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్న పాకిస్తాన్.. భారత్​ తీసుకున్న ఈ నిర్ణయాలతో మరింత చితికిపోనుందని నిపుణులు చెబుతున్నారు.

భారత్​ ప్లాన్​ ఏంటంటే?

ఎఫ్‌‌ఏటీఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ. మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక నేరాలను నిరోధించడానికి విధానాలు, మార్గదర్శకాలు రూపొందిస్తుంది. 1989లో జీ7 దేశాలు దీనిని స్థాపించాయి.  ప్రస్తుతం ఇందులో 40 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి, జూన్​, అక్టోబర్​లో ప్లీనరీ సమావేశాలు ఉంటాయి. ఇందులో సభ్య దేశాలతో చర్చించి, పాకిస్తాన్​ను గ్రే లిస్ట్​లో చేర్చేలా భారత్​ ప్రయత్నించాలని నిర్ణయించింది. ఇంతకుముందు కూడా ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు)లో పాకిస్తాన్​ ఉన్నది. 2018 జూన్​లో దాన్ని ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే లిస్ట్​లో చేర్చగా.. 2022 అక్టోబర్​లో నిషేధ జాబితానుంచి తొలగించారు. ఇక 2024 జూలై నుంచి మూడేండ్లపాటు పాకిస్తాన్​కు ఐఎంఎఫ్​ నుంచి 7 బిలియన్ల డాలర్ల సాయం మంజూరుకు ఒప్పందం ఖరారైంది. అయితే, ఈ ఆర్థిక సాయాన్ని పాకిస్తాన్​కు టెర్రర్ యాక్టివిటీస్​కు ఉపయోగిస్తుందని, నిధులు విడుదల చేయకుండా ఐఎంఎఫ్​పై ఒత్తిడి తీసుకురావాలని భారత్ యోచిస్తున్నది.  ఈ రెండు ఫైనాన్షియల్​ స్ట్రైక్స్​తో పాకిస్తాన్​ను  ఆర్థికంగానూ దెబ్బతీసి ఇరుకునపెట్టేందుకు చకచకా పావులు కదుపుతున్నది. 

పీవోకేలో మదర్సాలు క్లోజ్​

ఇండియన్​ మిలిటరీ స్ట్రైక్స్​భయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్​లోని వెయ్యి వరకు మదర్సాలను  మూసేశారు. ఈ ప్రాంతంలోని అన్ని మతపరమైన విద్యాసంస్థలను 10 రోజుల పాటు క్లోజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. తమపై త్వరలో సైనిక చర్య ప్రారంభించాలని భారత్ యోచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్​ సమాచారం ఉందని పాకిస్తాన్​ చెబుతున్నది. మతపర విద్యాసంస్థలను భారత దళాలు లక్ష్యంగా చేసుకుంటాయని ఇక్కడి భద్రతా అధికారులు భయపడుతున్నారని పీవోకే మతపర వ్యవహారాల శాఖ డైరెక్టర్​ హఫీజ్​వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మదర్సాలను మూసేసినట్టు తెలిపారు. 

ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ​ఆక్రమించాలి: రిటైర్డ్​ మేజర్​ జనరల్​

భారత్​పై బంగ్లాదేశ్​ మేజర్​ జనరల్​ ఏఎల్ఎం ఫజుల్​ రెహమాన్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాకిస్తాన్​పై భారత్​ దాడి​ చేస్తే.. భారత్​లోని 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్​ ఆక్రమించుకోవాలని అన్నారు. ఇందుకు చైనా సాయం తీసుకోవాలన్నారు. చైనాతో కలిసి ఒక ఉమ్మడి సైనిక వ్యవస్థను ఏర్పాటుచేసే దిశగా చర్చించడం అత్యవసరమని చెప్పారు. ఈమేరకు తన ఫేస్​బుక్​ ఖాతాలో  బెంగాలీ భాషలో పోస్ట్​ పెట్టారు. ఫజుల్​ రెహమాన్.. బంగ్లాదేశ్​ రైఫిల్స్​ (బీడీఆర్) మాజీ అధిపతి. బీడీఆర్ ​మారణకాండపై  ఏర్పాటైన జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్ చైర్‌‌పర్సన్​గా ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్​ యూనస్​కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడం, పాక్ జాతీయులకు వీసాల రద్దు వంటి చర్యల నేపథ్యంలో రెహమాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, రెహమాన్​ చేసిన వ్యాఖ్యలు భారత్​–బంగ్లాదేశ్​  మధ్య సున్నితమైన సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.