జీ20 డిక్లరేషన్లో ప్రధాని మోడీది కీలక పాత్ర: అమెరికా

జీ20 డిక్లరేషన్లో ప్రధాని మోడీది కీలక పాత్ర: అమెరికా

ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సమావేశం నిర్ణయించడంలో భారత్ కీలక పాత్ర పోషిచిందని అమెరికా వెల్లడించింది. G20 సమ్మిట్ డిక్లరేషన్‌పై చర్చలు జరపడంలో ప్రధాని మోడీ ముఖ్య పాత్ర పోషించిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ తెలిపారు. ఈ యుగం యుద్ధాలు చేసుకునే యుగంగా ఉండకూడదని మోడీ కోరుకున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలే..జీ20 సదస్సు ముగింపులో అన్ని దేశాల సంయుక్త ప్రకటనగా విడుదలైందన్నారు. 


  
మోడీ సహకారం కీలకం..

బలమైన నాయకులు కలిగిన జీ20లో అమెరికా భాగస్వామ్యంగా ఉందని కరీన్ జీన్-పియర్ అన్నారు. జీ20 దేశాలైన భారత్, అమెరికా ఆహారం, ఇంధన సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఆహార, ఇంధన భద్రత, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నాల్లో ఉందన్నారు. తమ ప్రయత్నానికి ప్రధాని మోడీ సహకారం కీలకమని చెప్పారు. 2023లో జీ20 అధ్యక్షపదవి భారత్కు దక్కనుందని..ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వడానికి అమెరికా ఎదురుచూస్తోందన్నారు. 

యుద్ధానికి తెరపడాలి..

ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల G20 సమ్మిట్లో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, భారత ప్రధాని మోడీ, యూకే ప్రధాని రిషి సునక్తో సహా అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రభావం ఎక్కువగా చర్చించారు. శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ–20 దేశాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి  తెరపడాలని జీ20 దేశాలు నినదించాయి. ఉక్రెయిన్ రష్యా  యుద్ధం కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని జీ20 దేశాలు  పేర్కొన్నాయి. 

దౌత్య మార్గాలను కనుగొనాలి...

జీ20 సమ్మిట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే మార్గాలను కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేసిందని..ఆ తర్వాత ప్రపంచం శాంతి బాట పట్టేందుకే అప్పటి దేశాధినేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని కొనియాడారు. ప్రస్తుతం  రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి జీ20 దేశాలు అలాంటి ప్రయత్నాలు చేయాలని అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్పై రష్యా దాడిని దృష్టిలో పెట్టుకుని ఆ దేశ చమురు, గ్యాస్​ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని జీ20 సభ్య దేశాలను ప్రధాని మోడీ కోరారు. స్వచ్ఛమైన ఇంధనంతో పాటు పర్యావరణానికి భారత్​ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 

ప్రపంచ సంక్షేమానికి వేదికగా మారుస్తాం..

జీ 20 అధ్యక్ష బాధ్యతల్ని భారత్‌ స్వీకరించింది. జీ20 శిఖరాగ్ర ముగింపు సదస్సులో ప్రధాని మోడీ ఇండొనేసియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. వచ్చే ఏడాది జీ20 సదస్సు భారత్‌ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా జీ20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం తమకు గర్వకారణమని మోడీ అన్నారు.  సభ్య దేశాల సహాయ సహకారాలతో ప్రపంచ సంక్షేమానికి 2023 జీ 20 సదస్సును వేదికగా మారుస్తామన్నారు. భారత్‌ ఆధ్వర్యంలో జీ 20 అందరినీ కలుపుకొని పోతూ నిర్ణయాత్మకంగా.. చర్యలు తీసుకునేలా ఉంటుందన్నారు. 2024లో జీ20 సదస్సు బ్రెజిల్‌లో, 2025లో దక్షిణాఫ్రికాలో జీ 20 సదస్సు జరగనుంది.