టెర్రరిజంపై పోరు పాక్​కు చేతగాకుంటే..సాయానికి మేం సిద్ధం : రాజ్​నాథ్ సింగ్

టెర్రరిజంపై పోరు పాక్​కు చేతగాకుంటే..సాయానికి మేం సిద్ధం : రాజ్​నాథ్ సింగ్
  • ఇండియాను అస్థిరపర్చేందుకు మాత్రం ప్రయత్నించొద్దు: రాజ్​నాథ్ 
  • ఎమర్జెన్సీ టైమ్​లో 18 నెలలు జైల్లో ఉన్న
  • అమ్మ చివరి చూపునకూ నోచుకోలే  
  • జాతీయ మీడియా ఇంటర్వ్యూలో డిఫెన్స్ మినిస్టర్ ఎమోషనల్

న్యూఢిల్లీ:  ఇండియాను అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్​కు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ హెచ్చరించారు. ‘టెర్రరిజాన్ని అంతం చేయడం మీకు చేతగాకపోతే చెప్పండి.. హెల్ప్ చేసేందుకు ఇండియా సిద్ధంగా ఉన్నది’’ అని కామెంట్ చేశారు. టెర్రరిజానికి పాకిస్తాన్ పుట్టినిల్లుగా మారిందని మండిపడ్డారు. మిలిటెంట్ల సాయంతో ఇండియాలో దాడులు చేయాలని భావిస్తే గట్టిగా బుద్ధి చెప్తామన్నారు. పాక్​లోని టెర్రరిస్టు క్యాంపులను భూస్థాపితం చేస్తామని, ఏ శక్తీ తమను ఆపలేదన్నారు. గురువారం ఉదయం ఓ జాతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాం

విదేశీ గడ్డపై కూడా దాడి చేయగల సత్తా ఇండియాకు ఉందని రాజ్​నాథ్ అన్నారు. రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అప్పుడు దేశమంతా అల్లకల్లోలంగా మారింది. నన్ను జైల్లో వేశారు. అప్పుడు నా వయస్సు 23 ఏండ్లు. మా అమ్మ చనిపోయిందని సమాచారం వచ్చింది. పెరోల్ ఇవ్వాలని కోరాను. కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. చివరికి మా అమ్మ చివరి చూపునకు కూడా నేను నోచుకోలేదు. ఇప్పుడు వాళ్లు మమ్మల్నే నియంతలని అంటున్నారు’’ అని రాజ్​నాథ్ అన్నారు. 18 నెలలు జైలు జీవితం గడిపినట్టు తెలిపారు. 

బీజేపీ గోల్డ్.. కాంగ్రెస్ తుప్పు పట్టిన ఇనుము

దేశంలో ఉన్నవాళ్లందరూ తమకు సమానమని కేంద్ర రాజ్​నాథ్ అన్నారు. హిందువులు, ముస్లింలు అంటూ వివక్ష చూపబోమన్నారు. మధ్యప్రదేశ్​లోని రేవా, సాత్నా జిల్లాల్లో గురువారం జరిగిన  బహిరంగ సభల్లోనూ ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ 24 క్యారెట్ల బంగారం. కాంగ్రెస్ తుప్పు పట్టిన ఇనుము. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మా లక్ష్యం. బీజేపీ పట్ల కొందరు అసత్య ప్రచారం చేస్తున్నరు. కానీ మా పార్టీకి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ సమానమే. మనమంతా భరతమాత బిడ్డలం. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని రాజ్ నాథ్ సింగ్ కోరారు.