
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశిస్తూ.. ఈ ఏడాది మొదట్లో ఇండియా మా దేశంలో దురాక్రమణకు ప్రయత్నించిందని ఆరోపించారు. పాకిస్తాన్ దళాలు ధీటుగా ఇండియా దాడిని తిప్పికొట్టాయని ప్రగ్భలాలు పలికారు. సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా భారత్ రద్దు చేయడం యుద్ధ చర్య అని ఆయన అన్నారు. అన్ని రకాల ఉగ్రవాదానికి పాక్ వ్యతిరేకమని.. పాకిస్తాన్ శాంతిని కోరుకునే దేశమని నీతులు వల్లించారు.
తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మాజిద్ బ్రిగేడ్ వంటి విదేశీ నిధులతో నడిచే గ్రూపుల నుంచి పాక్ బాహ్య ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుందని భారత్‌పై నిరాధార ఆరోపణలు చేశారు. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా ప్రపంచదేశాల ముందు పాక్ ప్రధాని భారత్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు యూఎన్‌లో భారత కార్యదర్శి పెటల్ గహ్లోట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇండియాపై విషం చిమ్మిన పాక్ పీఎంను కడిగిపారేశారామె. అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రధాని అసంబద్ధమైన నాటకీయ వ్యాఖ్యలు చేశారని కౌంటర్ ఇచ్చారు. పాక్ విదేశాంగ విధానంలో కీలకమైన ఉగ్రవాదాన్ని ఆయన మరోసారి కీర్తించారని ఎద్దేవా చేశారు. ఓవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరోవైపు మాకేమి తెలియదంటూ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ నాటకాలు ఆడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అబద్ధాలు చెప్పడానికి పాక్ ఎప్పుడూ సిగ్గుపడదని.. కానీ వాస్తవాలను వారి అబద్ధాలు దాచలేవని స్పష్టంచేశారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్‌లాడెన్‌కు పాక్ దశాబ్దం పాటు ఆశ్రయం ఇచ్చిందని.. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనడానికే ఇదే సరైన నిదర్శనమని కౌంటర్ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్‌లో ఏడు భారత యుద్ధ విమానాలను కూల్చేమని పాక్ పీఎం చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. బహవల్‌పూర్, మురిద్కేలో ఉగ్రవాద శిబిరాలను ఇండియా ధ్వంసం చేయడం, ఇండియా దాడుల్లో చనిపోయిన టెర్రరిస్టుల అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించిన ఫొటోలను ప్రపంచమంతా చూసిందని పాక్ పరువు తీశారు.
చివరకు పాక్ దాడులు ఆపేయమని కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లు పాక్ విజయంలా ప్రధాని భావిస్తే.. ఆ విజయాన్ని పాక్ ఆస్వాదించవచ్చని సెటైర్ వేశారు.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. ఇందులో మూడో వ్యక్తి లేదా దేశ ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేశారామె. పాక్ నిజంగా శాంతి కోరుకుంటే ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఇండియాకు అప్పగించాలని డిమాండ్ చేశారు.