దేశంలో ఒకరోజే 26,506 కేసులు

దేశంలో ఒకరోజే 26,506 కేసులు
  • 7,93,802కి చేరిన కేసుల సంఖ్య
  • 24 గంటల్లో 475 మంది మృతి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 26,506 కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802కి చేరింది. ఇప్పటి వరకు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 21,604కు చేరింది. ఈ నెల 3నుంచి రోజుకు దాదాపు 20వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు వారంలోనే 2లక్షల కేసులు నమోదయ్యాయని లెక్కలు ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు 4,95,512 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. భారత్‌ రికవరీ రేట్‌ 62.42శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ రేట్‌ ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు.

రాష్ట్రాల పరిస్థితి ఇలా

మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 2.30లక్షల కేసులు నమోదయ్యాయి. 9,667 మంది చనిపోయారు. తమిళనాడులో 1,26,581 కేసులు నమోదు కాగా.. 1765 మంది వ్యాధి బారిన పడి చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,07,051 కేసులు నమోదు కాగా.. 3258 మంది చనిపోయారు. కేసులను తగ్గించేందుకు ఉత్తర్‌‌ప్రదేశ్‌, బీహార్‌‌, వెస్ట్‌బెంగాల్‌లో లాక్‌డౌన్‌ విధించారు.