IND vs ENG: భళా టీమిండియా..టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం

IND vs ENG: భళా టీమిండియా..టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం

ఇంగ్లాండ్ పై రాజ్ కోట్ టెస్టులో టీమిండియా భారీ విజయం సాధిస్తుందని బహుశా ఎవరూ అనుకోని ఉండరు. రెండో రోజు ముగిసే సమయానికి ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ డకెట్ సెంచరీతో 2 వికెట్లను 207 పరుగులు చేసిన ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. వ్యక్తిగత కారణాల వలన అశ్విన్ కూడా అందుబాటులో లేకపోవడంతో.. భారత్ ఈ మ్యాచ్ లో గెలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మూడు, నాలుగు రోజుల్లో మనోళ్లు చూపించిన జోరు ముందు ఇంగ్లాండ్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ ఇంగ్లాండ్ ను మట్టి కురిపించింది. 

434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 39.2 ఓవర్లలో 122 పరుగులకు కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో కనీస పోటీ ఇవ్వకుండా మన బౌలర్లు ఫలితాన్ని ఏకపక్షం చేశారు. స్పిన్నర్ జడేజా 5 వికెట్లతో ఇంగ్లాండ్ భరతం పట్టాడు. ఈ విజయంతో భారత్ టెస్ట్ క్రికెట్ లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 2021 లో న్యూజి లాండ్ పై ముంబైలో జరిగిన టెస్టులో 373 పరుగుల తేడాతో సాధించిన విజయాన్ని తాజాగా బ్రేక్ చేశారు. మరోవైపు ఇంగ్లాండ్ కు టెస్ట్ క్రికెట్ లో ఇది రెండో అతి పెద్ద ఓటమి.

 ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ(131),జడేజా(112) సెంచరీలతో 445 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ డకెట్(153) సెంచరీతో 319 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో యువ ఓపెనర్ జైశ్వాల్ డబుల్(214)సెంచరీతో 430 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లర్ చేసింది. 557 పరుగుల లక్ష్య ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలి   ఘోర ఓటమిని మూట కట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్రస్తుతం భారత్ 5 టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.