యూఎన్ కామెంట్లలో నిజం లేదు..మణిపూర్​లో శాంతి నెలకొంది

యూఎన్ కామెంట్లలో నిజం లేదు..మణిపూర్​లో శాంతి నెలకొంది

న్యూఢిల్లీ :  మణిపూర్ లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయంటూ యునైటెడ్ నేషన్స్ (యూఎన్) చేసిన కామెంట్లను మన దేశం తీవ్రంగా ఖండించింది. మణిపూర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యూఎన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఎన్ నిపుణులు చెప్పినదాంట్లో నిజం లేదని, ఆ ప్రకటన ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. యూఎన్ నిపుణులు ఏదో ఊహించుకుని మాట్లాడినట్టుగా ఉందని విమర్శించింది. ప్రస్తుతం మణిపూర్ లో శాంతి నెలకొందని, పరిస్థితి అదుపులో ఉందని యూఎన్ లోని పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ‘‘మా ప్రభుత్వం మణిపూర్ ప్రజల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉంది. అందుకు చర్యలు తీసుకుంది. మణిపూర్ లో పరిస్థితిపై ఎలాంటి అవగాహన లేకుండా యూఎన్ నిపుణులు మాట్లాడారు. రూల్స్ పాటించకుండా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వాళ్లు అడిగిన రిపోర్టులపై మేం జవాబు ఇచ్చే వరకు కూడా ఆగలేదు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగొద్దని ఆశిస్తున్నాం” అని యూఎన్ హ్యుమన్ రైట్స్ 
కమిషన్​కు మన దేశం తెలిపింది. 

యూఎన్ నిపుణులు ఏమన్నారంటే

మీడియా రిపోర్టులను బట్టి మణిపూర్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలుస్తోందని యూఎన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ప్రకటన విడుదల చేశారు. ‘‘మణిపూర్ లో భయానక పరిస్థితులు ఉన్నాయి. మహిళలపై గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నాయి. హత్యలు చేస్తున్నారు. ఇండ్లు తగులబెడుతున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నారు. బతికి ఉండగానే సజీవ దహనం చేస్తున్నారు” అని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని కోరారు.