సెంచరీలతో చెలరేగిన స్మృతి, హర్మన్‌ప్రీత్

సెంచరీలతో చెలరేగిన స్మృతి, హర్మన్‌ప్రీత్

హామిల్టన్ : మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. 78 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పారేసుకుంది. ఓపెనర్ యస్తీక భాటియా(21 బాల్స్ లో 31 పరుగులు) కొద్దిపేపు బ్యాట్ ఝలిపించినా.. ఆ తర్వాత ఆమెతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్(05), దీప్తిశర్మ(15) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత జట్టు 78 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ ఆచితూచి ఆడుతూ బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరిద్దరు సెంచరీలతో చెలరేగడంతో భారత్ ఈ వరల్డ్ కప్ మ్యాచుల్లోనే భారీ స్కోరు సాధించింది. స్మృతి మందాన 119 బాల్స్ లో 13 బౌండరీలు, 2 సిక్సర్లతో 123 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలవగా..  హర్మన్ ప్రీత్ కౌర్ 107 బాల్స్ లో 10 బౌండరీలు రెండు సిక్సర్లతో 109 పరుగులు చేసింది. 318 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు, భారత బౌలర్ల ధాటికి 162 కే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో స్నేహ్ రాణా 3, మేఘ్నా 2 వికెట్లు,  రాజేశ్వరి, పూజూ, ఝలన్ గోస్వామి తలో వికెట్ తీసి విండీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.