హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్‌పై జాగృతి చీఫ్ కవిత సెటైర్ వేశారు. సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని కేటీఆర్ మాట్లాడితే చూసి నవ్వొచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముచ్చర్ల సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఇక.. సికింద్రాబాద్ ను జిల్లా చేయాలని కేటీఆర్ ధర్నా చేశారని.. కానీ అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సికింద్రాబాద్ జిల్లా కోసం పోరాడిన వారిని అణిచివేసి జైల్లో వేశారని ఆరోపించారు. ఇవాళ కొత్తగా సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని కేటీఆర్ అంటున్నారని కవిత ఫైర్ అయ్యారు. అయినా జిల్లాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యం కాదని అన్నారు. జిల్లాల పునర్విభజన ఎప్పుడూ జరిగిన సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
►ALSO READ | దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి.. టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో కీలక భేటీ
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు రావొద్దనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు, ఆడబిడ్డలు కోరితే జాగృతి తరుఫున మద్దతు ఇస్తామని తెలిపారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ బీసీలను మభ్యపెట్టిందని అన్నారు.
