
జోహోర్ బహ్రు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్‌లో ఇండియా జూనియర్ మెన్స్ హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ఇండియా 1–2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఇండియా తరఫున అన్మోల్ ఎక్కా (17వ ని) ఏకైక గోల్ చేయగా, ఆసీస్ తరఫున ఇయాన్ గ్రోబ్లార్ (13, 59వ ని) డబుల్ గోల్స్ చేశాడు. ఫలితంగా ఆసీస్‌కు నాలుగో టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు ఫైనల్ చేరిన ఇండియాకు ఇది ఐదో సిల్వర్ మెడల్. గత రెండు ఎడిషన్లలో బ్రాంజ్ మెడల్స్‌ను సాధించింది.
ఇక మూడు ఫైనల్స్ ఓడిన పరంపరను బ్రేక్ చేసిన కంగారూలు 2022లో ఇండియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నారు. స్టార్టింగ్‌లో షార్ట్ పాస్‌లతో బాల్‌ను ఆధీనంలో ఉంచుకున్న ఇండియాకు ఐదో నిమిషంలో గోల్ కొట్టే చాన్స్ వచ్చింది. కానీ అరైజిత్ సింగ్ హుండాల్, సౌరభ్ ఆనంద్ కుష్వా మధ్య సమన్వయ లోపంతో కొట్టిన పాస్‌ను ఆసీస్ గోల్ కీపర్ మాగ్నస్ మెక్‌కాస్లాండ్ అడ్డుకున్నాడు. 10 నిమిషాల టైమ్‌లో అమీర్ అలీ కొట్టిన శక్తివంతమైన లాంగ్ షాట్‌ను గుర్జోత్ గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్లినా సక్సెస్ కాలేదు.
13వ నిమిషంలో లభించిన పెనాల్టీని గ్రోబ్లార్ గోల్‌గా మలిచాడు. రెండో క్వార్టర్‌లో అన్మోల్ ఎడమ వైపు నుంచి కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌లోకి దూసుకుపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఆసీస్ దాడిని తట్టుకుని డిఫెన్స్ గట్టిగా నిలబడినా ఫార్వర్డ్స్ బాల్‌పై ఆధిపత్యం చూపెట్టలేకపోయారు. అవకాశాలను సృష్టించడంలో ఫెయిలయ్యారు. హాఫ్ టైమ్‌కు ముందు రెండు పెనాల్టీలు లభించినా వృథా అయ్యాయి. సెకండాఫ్‌లో మరింత దూకుడుగా ఆడిన కంగారూలు వరుసగా పెనాల్టీలను సాధించారు. కానీ అంగుళం తేడాతో గోల్ పోస్ట్ నుంచి దూరం వెళ్లిపోయాయి. చివరకు 59వ నిమిషంలో గ్రోబ్లార్ పెనాల్టీని గోల్‌గా మలిచి కంగారూలను 2–1 ఆధిక్యంలో నిలిపాడు. ఇక్కడి నుంచి ఇండియాకు ఆరు పెనాల్టీలు లభించినా స్కోరును సమం చేయలేకపోయింది.