కౌలాలంపూర్: ఇండియా సీనియర్ షట్లర్, తెలుగు ఆటగాడు బి. సాయి ప్రణీత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. కొంతకాలంగా తీవ్రంగా నిరాశ పరుస్తున్న ప్రణీత్.. మలేసియా ఓపెన్‌లోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మరో సీనియర్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట కూడా బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయి ప్రణీత్ 15-–21, 21–-19, 9–-21తో ఆరో ర్యాంకర్ ఆంథోని సినిసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 21-–14 ,17-–21, 21–-18తో లోకల్ హీరో డారెన్ లీపై పోరాడి గెలిచాడు. 21వ ర్యాంకర్ అయిన ప్రణయ్.. రెండో రౌండ్‌లో నాలుగో సీడ్ చౌ తైన్ చెన్ (తైపీ)ని ఎదుర్కొంటాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ 14-–21, 21–-13, 7–-21 తో ఎనిమిదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21-–18, 21–-11తో మన్ వీ చోంగ్–కై వున్ టీ (మలేసియా) జంటను ఓడించి రెండో రౌండ్ చేరింది. కానీ, విమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంట 15-–21, 11–-21తో ఆరో సీడ్ నమి మత్సుయమ–చిహారు షిడ (జపాన్) చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.
