న్యూఢిల్లీ: కెరీర్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న ఇండియా స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. సెలక్షన్ ట్రయల్స్‌లో తన పంచ్ పవర్ చూపెట్టిన వరల్డ్ చాంపియన్ నిఖత్ (50 కేజీ)తో పాటు ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ (70 కేజీ), నీతూ ఘంఘాస్ (48 కేజీ), జాస్మిన్ లంబోరియా (60 కేజీ) బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్‌లో పోటీపడే ఇండియా విమెన్స్ బాక్సింగ్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ గాయం కారణంగా ట్రయల్స్ మధ్యలోనే నిష్క్రమించింది. అయితే, 52 కేజీ కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచి కామన్వెల్త్ కోసం కొత్త వెయిట్ కేటగిరీలోకి వచ్చినప్పటికీ (50 కేజీ) నిఖత్ అంచనాలను అందుకుంది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ బౌట్‌లో నిఖత్ 7–0తో మీనాక్షిని చిత్తు చేసింది. బౌట్ ఆరంభం నుంచి చివరి వరకు ఫుల్ కంట్రోల్‌లో కనిపించిన నిఖత్.. ప్రత్యర్థిపై స్పష్టమైన పంచ్‌లు కొట్టి ఏకపక్ష విజయం సాధించింది. ఇతర ఫైనల్స్‌లో లవ్లీనా కూడా 7–0 పూజను చిత్తు చేయగా.. నీతు 5–2తో మంజు రాణిని ఓడించింది. జాస్మిన్ 6–1తో పర్వీన్‌పై గెలిచి టీమ్‌లోకి వచ్చింది. కామన్వెల్త్ మెన్స్ టీమ్‌ను ఇప్పటికే ప్రకటించారు. కాగా 2018 ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా బాక్సర్లు మూడు గోల్డ్ సహా తొమ్మిది పతకాలు సాధించారు.
వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత ఇంటికి వెళ్లి చాలా ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నా. ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు. దాంతో, కాంపిటీటివ్ జోన్‌లోకి రావడం కొంచెం కష్టమైంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చేసిన దాంట్లో 50 శాతం పెర్ఫామెన్స్ ఇవ్వలేదని నాకు తెలు సు. అయినా నా ప్రత్యర్థులందరిపై ఏకగ్రీవ విజయాలు సాధించినందుకు సంతోషంగా ఉంది. అయితే, ఇది నా సొంత వెయిట్ కేటగిరీ కాదు. దీనికి అవసరమైన ఫిట్‌నెస్ లెవెల్ అందుకోవాలంటే చాలా కష్టపడాలి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతా.
‑ నిఖత్ జరీన్

