అగ్ని– 5 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

అగ్ని– 5 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని భారత్ గురువారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. గరిష్ఠంగా 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలగడం దీని ప్రత్యేకత. మునుపటి కంటే అగ్ని–5 క్షిపణి బరువును తగ్గించామని భారత రక్షణశాఖ  వర్గాలు తెలిపాయి. అవసరమైతే అగ్ని–5 క్షిపణి లక్ష్యాల పరిధిని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుందని ప్రయోగ పరీక్షల్లో తేలిందని వెల్లడించాయి.

డిసెంబరు 9న సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో భారత్  అగ్ని–5 క్షిపణితో ట్రయల్స్ నిర్వహించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ క్షిపణి చైనా రాజధాని బీజింగ్ తో పాటు ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను చేరుకోగలదు. త్వరలోనే ఈ క్షిపణిని భారత సైన్యానికి చెందిన వ్యూహాత్మక సైనిక కమాండ్ కు అప్పగించనున్నారు. వాస్తవానికి అగ్ని–5 క్షిపణిని తొలిసారిగా 2012 సంవత్సరంలో పరీక్షించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దీన్ని మొత్తం తొమ్మిదిసార్లు టెస్ట్ చేయడం గమనార్హం.