- 150, 300 కిలోమీటర్ల పరిధి గల రెండు వెర్షన్లు ప్రయోగం
- ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో పరీక్షలు
- ఈ రాకెట్ల తయారీలో నిబే లిమిటెడ్ అనే భారతీయ ప్రైవేట్ సంస్థ కీలక పాత్ర
- త్వరలోనే సైన్యంలోకి సూర్యాస్త్ర.. మరింత పటిష్టం కానున్న దేశ సరిహద్దులు
భారత రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. వందల కిలోమీటర్ల అవతల ఉన్న లక్ష్యాన్ని గురితప్పకుండా తుడిచిపెట్టే ‘సూర్యాస్త్ర’ రాకెట్ సిస్టమ్ పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్‌ను పరీక్షించారు.
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. వందల కిలోమీటర్ల అవతల ఉన్న లక్ష్యాన్ని గురితప్పకుండా తుడిచిపెట్టే ‘సూర్యాస్త్ర’ రాకెట్ సిస్టమ్ పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో సోమవారం ప్రారంభమైన సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ ప్రయోగాలు.. మంగళవారం ముగిశాయి. ఈ రెండు రోజుల్లోనే 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల పరిధి గల రెండు రకాల రాకెట్ వెర్షన్లను అధికారులు విజయవంతంగా పరీక్షించారు.
ఫలితాలను బుధవారం అధికారికంగా ప్రకటించారు. ‘నిబే లిమిటెడ్’ అనే భారతీయ ప్రైవేట్ సంస్థ సూర్యాస్త్ర రాకెట్లను తయారు చేసింది. పరీక్షల్లో 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల పరిధి గల రాకెట్లు తమ లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో తాకాయి. 150 కిలోమీటర్ల రాకెట్ తన లక్ష్యానికి కేవలం 1.5 మీటర్ల సమీపంలో, 300 కిలోమీటర్ల రాకెట్ లక్ష్యానికి 2 మీటర్ల లోపు దూరంలో తాకింది. సైనిక పరిభాషలో దీన్ని ‘సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్(సీఈపీ)’ అని పిలుస్తారు.
లాంగ్-రేంజ్ రాకెట్లకు ఈ స్థాయి కచ్చితత్వం రావడం చాలా అరుదు. సూర్యాస్త్ర అనేది ఒక అత్యాధునిక గైడెడ్ రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్. అంటే రిమోట్ కంట్రోల్ లేదా జీపీఎస్ ద్వారా గాల్లోనే దారి మార్చుకుంటుంది. ఇది శత్రువుల కమాండ్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, లాజిస్టిక్ హబ్‌లను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది హైటెక్ గైడెన్స్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మైళ్ల దూరంలో ఉన్న శత్రువులను సైతం ఇది గురితప్పకుండా అటాక్ చేస్తుంది.
యుద్ధభూమిలో దళాలకు మద్దతుగా..
ఈ రాకెట్లలోని 150 కిలోమీటర్ల మోడల్ నేరుగా యుద్ధభూమిలో దళాలకు మద్దతుగా నిలుస్తుంది. అలాగే, 300 కిలోమీటర్ల మోడల్ శత్రు భూభాగంలో చాలా లోపల ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలను సులువుగా తుడిచిపెడుతుంది. దీనివల్ల సైనిక ప్రాణనష్టం ఉండదు. ఆధునిక యుద్ధాల్లో ఇలాంటి కచ్చితమైన ఆయుధాలు చాలా కీలకం. ఈ సూర్యాస్త్ర పరీక్షలు భారత రక్షణ రంగంలో వస్తున్న పెద్ద మార్పునకు నిదర్శనం.
గతంలో ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన రక్షణ ప్రాజెక్టులను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు విజయవంతంగా నిర్మిస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌కు అద్దం పడుతోంది. దీనివల్ల రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ఈ అద్భుతమైన స్వదేశీ రాకెట్ వ్యవస్థ త్వరలోనే భారత సైన్యంలో చేరనుంది. ఇది మన దేశ సరిహద్దు రక్షణను మరింత పటిష్టం చేయనుంది.
