
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ స్థానికంగా తయారయ్యేలా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, ఇండియా రూ. 85,000 కోట్లకు పైగా విలువైన మొబైల్ ఎగుమతులను సాధించింది. ఇది మనకు అద్భుతమైన విజయమని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) కామెంట్ చేసింది. సంస్థ అందించిన డేటా ప్రకారం, 2022-–2023 ఆర్థిక సంవత్సరంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాల కారణంగా తయారీ పెరగడంతో 10 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు సాధ్యమయ్యాయి.
స్థానిక తయారీకి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మొబైల్ ఫోన్ పరిశ్రమకు ఎంతో ఊపునిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. దీంతో మనదేశంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా నిలిచింది. ఇండియాలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో 97 శాతానికి పైగా ఇప్పుడు స్థానికంగానే తయారవుతున్నాయి. ఇండియా నుంచి ప్రస్తుతం యూఏఈ, అమెరికా, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి భారీగా ఫోన్లు వెళ్తున్నాయి. మొబైల్ ఫోన్ పరిశ్రమ 40 బిలియన్ డాలర్ల తయారీ ఉత్పత్తిని దాటుతుందని ఐసియా చైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు.