సెకండ్ వేవ్ వణికించినా తట్టుకుని నిలబడ్డ భారత్

సెకండ్ వేవ్ వణికించినా తట్టుకుని నిలబడ్డ భారత్

2021లో దేశంలో కీలక ఘటనలు జరిగాయి. ఓ వైపు రైతుల పోరాటం, ఇంకోవైపు కరోనా విలయంతో ఈ ఏడాది గడిచిపోయింది. కొన్ని దేశం గర్వించే క్షణాలు, ఇంకొన్ని విషాద ఘటనలతో ఈ ఏడాది నిండిపోయింది. 2021 రిపబ్లిక్ డే వయొలెన్స్ దగ్గర్నుంచి నాగాలాండ్ లో పౌరులపై కాల్పులు, 5 రాష్ట్రాల ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ, ఒలింపిక్స్ లో మంచి ఫలితాలు ఇలాంటివెన్నో కీలక ఈవెంట్లు జరిగాయి.  దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన ఘటనలు చాలా కీలకంగా మిగిలిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చాలా వణికించినా తట్టుకుని నిలబడింది దేశం. ఈ ఏడాది మొత్తంలో జరిగిన ఘటనలు ఒకెత్తు, కరోనా సెకండ్ వేవ్, రైతుల పోరాటం మరో ఎత్తుగా మిగిలాయి. ఏడాది చివరికి వచ్చే సరికి కరోనా టెన్షన్ తగ్గినా ఒమిక్రాన్ రూపంలో మరో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇంకోవైపు కేంద్రం సాగు చట్టాలను వెనక్కు తీసుకుని రద్దు చేయడంతో రైతులు కూడా ఆందోళనలకు ముగింపు పలికారు. 

కరోనాపై పోరాటంలో భాగంగా మన దగ్గర కోవిషీల్డ్, కో వ్యాక్జిన్ కు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. మొదట హెల్త్, ఫ్రంట్ లైన్ సిబ్బంది, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, చివరకు 18 ఏళ్లు నిండిన వారికి ఇలా విడతల వారీగా అవకాశం కల్పించారు. వ్యాక్సినేషన్ లో భారత్ చాలా మైలురాళ్లు అందుకుంది. ఇప్పటికే 140 కోట్లకు పైగా డోసులను సప్లై చేసి జనానికి ఇచ్చారు. వ్యాక్సినేషన్ పై కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్ క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది. ఈ ఏడాది చివరికి అర్హులైన అందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. 


డెల్టా వేరియంట్ ఎఫెక్ట్ తో భారత్ లో సెకండ్ వేవ్ చాలా సమస్యలు సృష్టించింది. ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే లక్షణంతో దేశాన్ని వైరస్ చుట్టేసింది. ఏప్రిల్ 30న ఒకేరోజు అత్యధికంగా 4 లక్షల పాజిటివ్ కేసులు, 3500 మరణాలు సంభవించాయి. అదే అత్యధికం. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో చాలా మంది చనిపోయారు. హాస్పిటళ్లు నిండిపోయాయి. సామూహిక శవదహనాలు చివరికి గంగానదిలో శవాలు తేలడం ఇవన్నీ సంచలనంగా మారాయి. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి సెకండ్ వేవ్ నెమ్మదిస్తూ వచ్చింది. ఇప్పుడు తక్కువ కేసులు వస్తున్నా ఒమిక్రాన్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. దేశీయ తయారీ కోవ్యాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఎమర్జెన్సీ అప్రూవల్ లభించింది. భారత్ బయోటెక్, ICMR నుంచి పలుమార్లు డేటా తెప్పించుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే అప్రూవల్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తో అలర్ట్ అయిన కేంద్రం అన్ని రాష్ట్రాల్లో చాలా హాస్పిటల్స్ కు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు సహకరించింది. హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెంచింది. 
 
ఇక ఈ ఏడాది రైతుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. కేంద్రం తెచ్చిన 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా నార్త్ ఇండియాకు చెందిన రైతులు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి రైతులు చాలా పోరాటం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని రోజూ నిరసనలు చేపట్టారు. జనవరి 26 ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎర్రకోట దగ్గర చాలా హడావుడి నడిచింది. దీనిపై రైతు సంఘాలు వెనక్కు తగ్గాయి. రైతుల ఆందోళనలపై ఒక దశలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులు తమ నిరసనలు చేసుకోవచ్చని, అయితే రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని సుప్రీం కామెంట్ చేసింది. వెంటనే రోడ్ల వెంట టెంట్లు, బారికేడ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. చివరకు ప్రధాని మోడీ 3 సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల మేల కోసమే ఆ చట్టాలు తీసుకొచ్చామని, నిపుణులు, రైతులను సంప్రదించిన తర్వాతే కొత్త చట్టాలు చేశామని మోడీ వివరించారు. అయితే కొత్త చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించలేకపోయామన్నారు. దీంతో చివరకు కొత్త చట్టాలు రద్దు చేశారు. దీంతో రైతు సంఘాలు కూడా తమ ఆందోళనలకు ముగింపు పలికాయి. 


రైతు నిరసనల్లో యూపీలోని లఖీంపూర్ ఖేరి ఘటన తీరని విషాదంగా మిగిలిపోయింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ర్యాలీలో కొన్ని వాహనాలు వేగంగా దూసుకొచ్చి రైతులను ఢీకొట్టాయి. ఆ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఘటనలో కేంద్రమంత్రి కుమారుడి హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు రావడం, ఆయన్ను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే మొత్తం రైతుల నిరసనల్లో ఇదే తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఇక ఈ ఏడాది 4 కీలక రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం సహా పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారి అధికారం చేపట్టారు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా చివరకు నిలబడ్డారు. అయితే నందిగ్రామ్ లో ఓడిపోయిన మమత.. మరో చోట గెలిచి సీఎం పదవిలో కంటిన్యూ అవుతున్నారు. బెంగాల్ ఎలక్షన్స్ అంటేనే హింస ఎక్కువగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఎన్నికలకు ముందు చాలా ఉద్రిక్తతలు, విధ్వంసాలు, మరణాలు సంభవించాయి. ఇక కేరళలో ఒక దఫా LDFకు మరో దఫా UDFకు జనం ఎన్నుకుంటారు. అయితే ఈ సారి UDF వంతు రావాల్సి ఉన్నా... కేరళ చరిత్రలో మరోసారి LDFకు జనం పట్టం కట్టారు. 44 ఏళ్ల తర్వాత ఇలా వరుసగా LDF ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. పినరయి విజయన్ సీఎంగా ఉన్నారు. మరోవైపు కీలకమైన తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారం చేపట్టింది. కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన ఎన్నికలు కావడం, జనం ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ కలిగింది. చివరకు స్టాలిన్ చేతికి పగ్గాలు వచ్చాయి. ఇక అసోంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకొంది. 126 సీట్లకు గానూ 75 చోట్ల బీజేపీ మిత్ర పక్షాలు విజయం సాధించాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. పోలింగ్ తర్వాత బీజేపీ దాని మిత్ర పక్షాలు కలిసి అధికారాన్ని చేపట్టాయి.