ఇండియా అదిరిపోయే ఫినిషింగ్​

ఇండియా అదిరిపోయే ఫినిషింగ్​

మాంచెస్టర్‌‌:   ఇంగ్లండ్​ టూర్​కు ఇండియా అదిరిపోయే ఫినిషింగ్​ ఇచ్చింది. హార్దిక్‌‌ పాండ్యా (4/24; 55 బాల్స్‌‌లో 10 ఫోర్లతో71) ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌కు తోడు  రిషబ్‌‌ పంత్‌‌ (113 బాల్స్‌‌లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 నాటౌట్‌‌) తొలి సెంచరీతో చెలరేగిన వేళ మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో  260 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో 72/4తో ఓటమికి ఎదురీదిన టీమిండియా  పంత్‌‌, పాండ్యా ఖతర్నాక్‌‌ బ్యాటింగ్‌‌తో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌ను ఓడించి టూర్‌‌ను విజయంతో ముగించింది. తొలుత పాండ్యా దెబ్బకు ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ 45.5 ఓవర్లలో 259 రన్స్‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌ జోస్‌‌ బట్లర్‌‌ (60), జేసన్ రాయ్‌‌ (41) రాణించారు. పాండ్యాకు తోడు చహల్‌‌ (3/60) మూడు, సిరాజ్‌‌ (2/66) రెండు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఇండియా 42.1 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌‌ను అందుకుంది. ధవన్‌‌ (1), రోహిత్‌‌ (17), కోహ్లీ (17) మళ్లీ ఫెయిలైనా పంత్‌‌, పాండ్యా ఐదో వికెట్‌‌కు 133 రన్స్‌‌ జోడించి జట్టుకు విజయం అందించారు. పంత్​కు​ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌, హార్దిక్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌ అవార్డులు దక్కాయి. 

బౌలర్లు సూపర్‌‌

హార్దిక్‌‌ పాండ్యా కెరీర్‌‌ బెస్ట్‌‌ బౌలింగ్‌‌కు తోడు స్టార్టింగ్‌‌లో సిరాజ్‌‌, చివర్లో స్పిన్నర్‌‌  చహల్‌‌ సత్తా చాటడంతో ఆతిథ్య జట్టును ఇండియా తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. టాస్‌‌ నెగ్గి బౌలింగ్‌‌ ఎంచుకున్న రోహిత్‌‌ నిర్ణయానికి పేసర్‌‌ సిరాజ్‌‌ పూర్తి న్యాయం చేశాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన సిరాజ్‌‌ తన తొలి ఓవర్లోనే బెయిర్‌‌స్టో (0), జో రూట్‌‌ (0) ఇద్దరినీ డకౌట్‌‌ చేసి హోమ్‌‌ టీమ్‌‌కు షాకిచ్చాడు. అయినా ఓపెనర్‌‌ రాయ్ వరుసగా బౌండ్రీలు కొడుతూ వేగంగా బ్యాటింగ్‌‌ చేశాడు. అతనికి బెన్‌‌ స్టోక్స్‌‌ (27) సహకారం అందించాడు. ఈ టైమ్‌‌లో బౌలింగ్‌‌లో వచ్చిన హార్దిక్‌‌..  ఐదు ఓవర్ల తేడాతో ఈ ఇద్దరినీ పెవిలియన్‌‌ చేర్చడంతో 74/4తో ఇంగ్లండ్‌‌ కష్టాల్లో పడ్డది.  ఈ దశలో కెప్టెన్‌‌ బట్లర్‌‌..  మొయిన్‌‌ అలీ (34) ఐదో వికెట్‌‌కు 75 రన్స్‌‌, లివింగ్‌‌స్టోన్‌‌ (27)తో ఆరో వికెట్‌‌కు 49 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు. అయితే, అలీని జడేజా వెనక్కుపంపగా.. 37వ ఓవర్లో లివింగ్‌‌స్టోన్‌‌, బట్లర్‌‌ వికెట్లు పడగొట్టిన పాండ్యా ఇంగ్లండ్‌‌ను మరోసారి దెబ్బకొట్టాడు. చివర్లో ఒవర్టన్‌‌ (32), విల్లీ (18) పోరాటంతో హోమ్‌‌టీమ్‌‌ 250 మార్కు దాటింది. స్పిన్నర్‌‌ చహల్‌‌ ఆఖరి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌‌ను ఆలౌట్‌‌ చేశాడు.

పంత్‌‌‑పాండ్యా జోరు

గత మ్యాచ్‌‌ మాదిరిగానే ఛేజింగ్‌‌లో ఇండియా మళ్లీ తడబడింది. హోమ్‌‌టీప్‌‌ పేసర్‌‌ రీస్‌‌ టాప్లీ(3/35) దెబ్బకు టాపార్డర్‌‌ కూలింది. ధవన్‌‌ మూడో బాల్‌‌కే వికెట్‌‌ పారేసుకోగా.. రోహిత్‌‌, కోహ్లీ కూడా టాప్లీకే వికెట్లు ఇచ్చుకోవడంతో 38/3తో ఇండియా ఇబ్బందుల్లో పడింది. ఆపై, పంత్‌‌తో నాలుగో వికెట్‌‌కు 34 రన్స్‌‌ జోడించిన సూర్య (16)ను 17వ ఓవర్లో ఓవర్టన్‌‌ వెనక్కుపంపడంతో ఇండియాకు ఓటమి తప్పదనిపించింది. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న పంత్‌‌కు పాండ్యా తోడయ్యాడు. ఇంగ్లండ్‌‌ బౌలర్లకు ఈ ఇద్దరూ ఎలాంటి చాన్స్‌‌ ఇవ్వలేదు. తొలుత కాస్త జాగ్రత్తగా ఆడిన పంత్‌‌, పాండ్యా తర్వాత గేర్లు మార్చి ఎదురుదాడి చేశారు. ఏ బౌలర్‌‌నూ వదలకుండా అద్భుతమైన షాట్లతో వరుస పెట్టి బౌండ్రీలు రాబట్టి ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఆపై, పంత్‌‌ మరింత స్పీడు పెంచాడు. ఒవర్టన్‌‌ను టార్గెట్‌‌ చేసి 4, 4 ఆపై, 4, 6తో రెచ్చిపోయాడు. కార్స్‌‌ బౌలింగ్‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన పాండ్యా.. బెన్‌‌స్టోక్స్‌‌ పట్టిన డైవింగ్‌‌కు క్యాచ్‌‌కు ఔటయ్యాడు. అప్పటికి ఇండియాకు మరో 55 రన్స్‌‌ అవసరం అవగా.. జడేజా (7 నాటౌట్‌‌)తో కలిసి పంత్‌‌ లక్ష్యాన్ని కరిగించాడు. ఈ క్రమంలో రిషబ్​105 బాల్స్‌‌లో వన్డేల్లో తన  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  తర్వాత టాప్​ గేర్​లోకి వచ్చిన తను విల్లీ వేసిన 42వ ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు కొట్టి అలరించాడు. ఆపై, రూట్‌‌ బౌలింగ్‌‌లో రివర్స్‌‌ స్వీప్‌‌తో బౌండ్రీ కొట్టి మ్యాచ్‌‌ ముగించాడు.