
- కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం
- ఈ సీజన్‌లో ఇండియాకు తొలి టైటిల్ అందించిన శెట్టి
- విమెన్స్ సింగిల్స్‌లో రన్నరప్‌గా తన్వీ శర్మ
అయోవా (అమెరికా): ఇండియా యంగ్ షట్లర్ ఆయుష్ శెట్టి అమెరికా గడ్డపై అదరగొట్టాడు. యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ గెలుచుకున్నాడు. దాంతోపాటు ఈ సీజన్‌లో ఇండియా టైటిల్ కరువును కూడా తీర్చాడు. అలాగే, 16 ఏండ్ల యంగ్ ప్లేయర్ తన్వీ శర్మ విమెన్స్ సింగిల్స్ లో రన్నరప్‌గా నిలిచింది.
2023 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన 20 ఏండ్ల ఆయుష్ ఆదివారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో 21–-18, 21–-13 తేడాతో మూడో సీడ్ కెనడా ప్లేయర్ బ్రయాన్ యంగ్‌ను ఓడించి ఔరా అనిపించాడు. కేవలం 47 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించిన ఇండియా కుర్రాడికి ఈ ఏడాది యాంగ్‌పై వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇది వరకు మలేసియా, తైపీ ఓపెన్ టోర్నీల్లో యాంగ్‌ను ఓడించాడు.
మరోవైపు తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లో తన్వీ తడబడింది. ఆఖరాటలో అన్‌సీడెడ్ ఇండియా ప్లేయర్11–-21, 21–-16, 10–-21 తేడాతో టాప్ సీడ్ అమెరికా షట్లర్ బీవెన్ జాంగ్ చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి ఓడింది.
ఆయుష్ అదే జోరు
సెమీఫైనల్‌లో ఓ గేమ్ కోల్పోయి వెనుకబడినా పుంజుకొని టాప్ సీడ్ చౌ తియెన్ చెన్‌పై అద్భుత విజయం సాధించిన ఆయుష్ అదే జోరును ఫైనల్లోనూ చూపెట్టాడు. నాలుగో సీడ్ శెట్టి తొలి గేమ్‌ను 6-–6తో ప్రారంభించినప్పటికీ తర్వాత దూకుడుగా ఆడి 11-–6 ఆధిక్యంలోకి వెళ్లాడు. బ్రేక్ తర్వాత పుంజుకునే ప్రయత్నం చేసిన యంగ్ లీడ్‌ను13-–11కి తగ్గించి అదే జోరుతో 16-–16తో స్కోరు సమం చేశాడు.
కానీ, షటిల్‌పై తిరిగి కంట్రోల్ తెచ్చుకున్న ఆయుష్ జంప్ స్మాష్‌తో తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభంలోనే తను7-–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత యంగ్ కొంత కోలుకున్నా ఇండియా ప్లేయర్ నిలకడగా ఆడాడు. వెరైటీ షాట్స్, పదునైన డిఫెన్స్‌తో తన ప్రత్యర్థిని అడ్డుకున్నాడు. 17–-12తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఓ క్రాస్-కోర్ట్ పంచ్‌తో మ్యాచ్ పాయింట్ పైకి వచ్చిన అతను ఆ తర్వాత పవర్ ఫుల్ స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించి తన తొలి వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయుష్ గతంలో 2023 ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 టోర్నమెంట్, 2023 బహ్రెయిన్ ఇంటర్నేషనల్, 2024 డచ్ ఓపెన్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాడు.