లిథియం కోసం వేట

లిథియం కోసం వేట
  • లోకల్​తయారీకి ప్రభుత్వ ప్రయత్నాలు
  • విదేశాల్లో గనుల తవ్వకాలు

న్యూఢిల్లీ: ఇప్పుడు ఎక్కడ చూసినా కరెంటు బండ్ల హవా నడుస్తోంది. చాలా దేశాల మాదిరే ఇండియా కూడా ఈవీలకు చాలా ఇంపార్టెన్స్​ఇస్తోంది. వీటి వాడకాన్ని పెంచడానికి ఎన్నో రాయితీలను ఆఫర్​ చేస్తోంది.  ఈవీ బ్యాటరీల తయారీకి చాలా ముఖ్యమైన లిథియం మాత్రం మనదేశంలో దొరకడం లేదు. కంపెనీలన్నీ వీటిని చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. గాల్వాన్​ లోయలో ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణల తరువాత చైనాతో మన సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. దీనికితోడు కరోనా వచ్చింది. ఫలితంగా చైనా నుంచి లిథియం రాక ఆగిపోవడంతో ఇండియా ఇతర దేశాలవైపు చూడాల్సి వస్తోంది. మనదేశంలోనూ లిథియం నిక్షేపాలపై స్టడీ చేస్తోంది. ఇండియా క్రూడాయిల్ అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. వీటి కొనుగోలుకు పెద్ద ఎత్తున డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్రో ప్రొడక్టుల వల్ల కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఈవీలను ఎంకరేజ్​ చేయడానికి ఫేమ్​ వంటి పథకాలను అమలు చేస్తోంది. మనదేశంలోనే బ్యాటరీల తయారీని ఎంకరేజ్​ చేయడానికి రూ.18 వేల కోట్ల విలువైన ప్రొడక్షన్​ లింక్డ్‌​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) స్కీమ్​ను అమలు చేస్తోంది. అడ్వాన్స్​ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ)​ బ్యాటరీ స్టోరేజ్​తయారీకి ఇన్సెంటివ్​లు ఇస్తోంది. 

కర్ణాటకలో లిథియం..

బెంగుళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యా జిల్లాలో లిథియం జాడలను గుర్తించారు. ఇక్కడ దాదాపు 1,600 టన్నుల లిథియం నిక్షేపాలు ఉంటాయని అంచనా వేశారు.  అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 55,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 2021లో ఆస్ట్రేలియా అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారుగా ఎదిగింది. చిలీ,  చైనా వరుసగా 26,000,  14,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్​ కెపాసిటీతో రెండవ,  మూడవ స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రధానంగా స్పోడుమెన్ అనే లిథియం ఖనిజం నుండి అల్కలిన్​ను తీస్తుంది. చిలీ దీనినే ఉప్పునీటి నుండి పొందుతుంది.   చైనా కూడా లిథియంను భారీగా వాడుతోంది. దేశీయంగా లిథియం నిల్వల కోసం ప్రభుత్వం విపరీతంగా వెతుకుతోంది.  దిగుమతుల కోసం చైనాయేతర దేశాలవైపు చూస్తోంది. వచ్చే ఆరు నెలల్లో అక్కడ లిథియం,  కోబాల్ట్ గనులను తవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వంతో 6 మిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.  ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్​) ఆస్ట్రేలియా  క్రిటికల్ మినరల్స్ ఫెసిలిటేషన్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేసింది.  దక్షిణ అమెరికా దేశం అర్జెంటినాలో లిథియంను అక్కడి ప్రభుత్వంతో కలిసి వెతకడానికి  కూడా ఒక ఒప్పందంపై సంతకం చేసింది.

లిథియం ఎందుకు సరిపోవడం లేదు?

ఈవీలకు డిమాండ్​ విపరీతంగా పెరుగుతోంది. దీంతో పెద్ద ఎత్తున బ్యాటరీలను తయారు చేయడానికి తగినంత లిథియం రావడం లేదు. చైనాలోనే డిమాండ్​కు తగినంత లిథియం అందుబాటులో లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ మినరల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సైమన్ మూర్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ రాబోయే 10 సంవత్సరాలలో 40 కొత్త లిథియం గనులు అవసరమవుతాయని చెప్పారు.  వచ్చే ఏడేళ్లలో  15కు మించి కొత్త గనులు మొదలుకాకపోవచ్చని, వీటి వల్ల అదనంగా మిలియన్ టన్నుల లిథియం మాత్రమే అందుబాటులోకి వస్తుందని ఇటీవల ట్వీట్ చేశారు. ఉత్పత్తి తక్కువగా ఉన్నందున లిథియం కోసం భారతదేశం దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదు. ఇండియా కంపెనీలు నేరుగా లిథియంను కొనకుండా, లిథియం-అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి.