
అమెరికాతో ఇండియా ట్రేడ్ డీల్ తుది దశకు చేరిందని, ఈ డీల్ ఓకే అయితే ఇండియాపై టారిఫ్లు ప్రస్తుత 50% నుంచి 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని ‘మింట్’ మీడియా సంస్థ బుధవారం (అక్టోబర్ 23) ఓ కథనంలో వెల్లడించింది. ఇంధనం, వ్యవసాయ రంగాల్లో కీలకమైన ఈ డీల్ లో భాగంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును క్రమంగా తగ్గించుకునేందుకు కూడా ఇండియా అంగీకరించే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
ఈ డీల్‌కు సంబంధించి ముగ్గురు ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి సమాచారం అందినట్టుగా పేర్కొంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ పై త్వరలోనే జరిగే ఏసియాన్ సమిట్ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని వివరించింది. అయితే, దీనిపై ఇటు భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచి కానీ అటు అమెరికా నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.