బయటికొచ్చేశారు.. 41 మంది కార్మికులు సేఫ్​

బయటికొచ్చేశారు.. 41 మంది కార్మికులు సేఫ్​
  • ఉత్తరాఖండ్ టన్నెల్‌‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సేఫ్​
  • 17 రోజుల తర్వాత పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్.. 
  • మంగళవారం రాత్రి ఒక్కొక్కరుగా బయటికి
  • మెడికల్​ చెకప్ తర్వాత హాస్పిటల్​కు తరలింపు

ఉత్తరకాశీ/న్యూఢిల్లీ : 17 రోజుల ఎదురుచూపులకు తెరపడింది.. రోజంతా కొనసాగిన ఉత్కంఠకు శుభం కార్డు పడింది.. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. రెస్క్యూ సిబ్బంది నిర్విరామ కృషికి ఫలితం దక్కింది.. ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్‌‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రిల్లింగ్ ముగిసిన కొంతసేపటి తర్వాత.. ఒక్కొక్కరుగా పైప్‌‌లైన్ గుండా బయటికి వచ్చారు. కార్మికులను చూడగానే.. అక్కడున్న జనంలో హర్షాతిరేకాలు మొదలయ్యాయి. సంతోషంతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అక్కడే ఉన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర మంత్రి వీకే సింగ్.. కార్మికుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులందరూ క్షేమమని 
కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ వెల్లడించారు.

బయటికి వచ్చారిలా..

ఉత్తరకాశీలో చార్‌‌ధామ్‌‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగంలోని కొంతభాగం ఈ నెల 12న కుప్పకూలింది. దీంతో 41 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్నో అవాంతరాల తర్వాత మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో డ్రిల్లింగ్ పూర్తయింది. దీంతో టన్నెల్ బయట ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. 
అక్కడికి చేరుకున్న చుట్టుపక్క ఊళ్ల జనం, కార్మికుల బంధువులు, రెస్క్యూ సిబ్బంది వేయి కండ్లతో ఎదురుచూశారు. తొలుత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది లోనికి వెళ్లారు. తర్వాత కార్మికులు ఒక్కొక్కరుగా బయటికి రావడం చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు. తొలి కార్మికుడు వచ్చిన 30 నిమిషాల్లో 15 మంది బయటికి వచ్చారు. రాత్రి 9 గంటలకల్లా అందరూ బయటికి వచ్చేశారు.

అంబులెన్స్‌‌లో హెల్త్ సెంటర్‌‌‌‌కు..

కార్మికులు బయటికి వచ్చిన వెంటనే వారికి వైద్యం అందించేందుకు 8 బెడ్లతో కూడిన హెల్త్ సెంటర్‌‌‌‌ను టన్నెల్‌‌లోనే ఏర్పాటు చేశారు. ఇక్కడ చెకప్ తర్వాత 30 కి.మీ. దూరంలోని హెల్త్ సెంటర్‌‌‌‌కు అంబులెన్స్‌‌లో తరలించారు. చిన్యాలిసౌర్‌‌‌‌లోని కమ్యూనిటీ సెంటర్‌‌‌‌లో 41 ఆక్సిజన్ సపోర్ట్‌‌ బెడ్లతో కూడిన స్పెషల్ వార్డును ఏర్పాటుచేశారు. హెలికాప్టర్లు కూడా సిద్ధంగా పెట్టారు.

అవాంతరాలు ఎదురైనా..

17 రోజులుగా లోపల చిక్కుకుపోయిన కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారో.. వాళ్లను బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది కూడా అంతే కష్టపడ్డారు. సహాయక చర్యల్లో వారికి అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. లోపల తొలుత మట్టి తొలగించేందుకు ప్రయత్నిస్తే.. మరింత మట్టి కూలింది. దీంతో డ్రిల్లింగ్ ప్రారంభించారు. హారిజాంటల్, వర్టికల్‌‌గా డ్రిల్లింగ్ చేసినా.. అడ్డంకులే. భారీ యంత్రంతో డ్రిల్లింగ్ చేస్తే.. బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయకుండా పోయింది. ఇలా ఓ వైపు గడియారంలో ముల్లులా పని చేస్తూనే.. మరోవైపు చిన్న పైపు గుండా కార్మికులకు ఆహారం, మందులు, ఆక్సిజన్ అందించారు. వారితో తరచూ మాట్లాడుతూ ధైర్యం నింపారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడించారు. రోజులు గడుస్తున్న కొద్దీ కార్మికుల్లో మానసిక ఆందోళన మొదలవుతుందని.. కౌన్సెలింగ్ ఇచ్చారు. కంటిమీద కునుకులేకుండా పని చేసి.. మొత్తానికి సక్సెస్ అయ్యారు.

జైశ్రీరామ్, మోదీ నినాదాలు

ఆపరేషన్ పూర్తి కావచ్చిందని తెలియగా నే.. బయట ఉన్న జనం జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మరికొంద రు ‘భారత్ మాతాకీ జై’, ‘మోదీ హై తో ముమ్‌‌కిన్ హై(మోదీ ఉంటే సాధ్యమే)’ అంటూ స్లోగన్లు ఇచ్చారు. రెస్క్యూ టీమ్​ కు ప్రెసిడెంట్​ ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

‘ర్యాట్ హోల్ మైనింగే’ కాపాడింది!

రెస్క్యూ ఆపరేషన్‌‌లో అధునాతన, ఇంపోర్టెడ్ డ్రిల్లర్లు చేయలేని పనిని.. మన పాత మాన్యువల్ సిస్టమ్‌‌ చేసింది. ప్రభుత్వం నిషేధించిన ‘ర్యాట్ హోల్ మైనింగ్’.. కార్మికులను కాపాడటంలో కీలకంగా పని చేసింది. డ్రిల్లింగ్ ఆపరేషన్ చివర్లో అగర్ మెషిన్ విఫలం కావడంతో.. సోమవారం ర్యాట్ హోల్ మైనింగ్‌‌ చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ ఈ డ్రిల్లింగ్ పనిని పూర్తిచేసింది. నిజానికి గనుల నుంచి బొగ్గును బయటికి తీసేందుకు మేఘాలయలో ఈ పద్ధతిని ఎప్పటి నుంచో అనుసరిస్తున్నారు. చిన్నపాటి పనిముట్లతో బొగ్గును కొద్దికొద్దిగా బయటికి తీసుకొచ్చి.. ఒక చోట డంప్ చేస్తారు. అక్కడి నుంచి హైవేల ద్వారా రవాణా చేస్తారు. చిన్నపాటి గొయ్యిని తవ్వుతూ వెళ్తారు. ఒకరు తవ్వితే.. ఇంకొకరు మట్టిని సేకరిస్తారు.. ఇంకొకరు బయటపడేస్తారు. అయితే ఈ తరహా మైనింగ్‌‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ 2014లో బ్యాన్ చేసింది. సురక్షితం కాదని, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని నిషేధించింది.

టన్నెల్​ లోపలే 17 రోజులు.. 

చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా, దండల్ గావ్ మధ్య టన్నెల్ ను నిర్మిస్తోంది. దీని పొడవు 4.5 కిలోమీటర్లు. సిల్క్యారా వైపు నుంచి 2.4 కిలోమీటర్లు, దండల్ గావ్ వైపు నుంచి 1.75 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం పూర్తయింది. అయితే ఈ నెల 12న కార్మికులు లోపల పనులు చేస్తుండగా సిల్క్యారా వైపు నుంచి 205–260 మీటర్ల మధ్య టన్నెల్ కూలిపోయింది. దీంతో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. కాగా, టన్నెల్ ప్లాన్ ప్రకారం ఎస్కేప్ రూట్ నిర్మించాల్సి ఉండగా, నిర్మాణ సంస్థ దాన్ని నిర్మించలేదు. 

మోదీపై కాంగ్రెస్ కార్టూన్.. 

ప్రధానిని విమర్శిస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో కార్టూన్​ను పోస్టు చేసింది. టన్నెల్ దగ్గర మోదీ పచ్చ జెండా పట్టుకుని ఉన్నట్టుగా ఉంది. ‘అక్కడ కొన్ని కెమెరాలు పెట్టండి.. అప్పుడు మోదీ వచ్చి కార్మికులకు వెల్కమ్ చెబుతాడు’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

టన్నెల్​ వర్కర్ల కుటుంబాల్లో సంతోషం.. 

డ్రిల్లింగ్ పూర్తయిందని అధికారులు ప్రకటించగానే కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ వాళ్లను చూసేందుకు వివిధ రాష్ట్రాల్లోని కార్మికుల కుటుంబసభ్యులు టీవీల ముందు కూర్చున్నారు. ‘‘నాకు చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు ఇంటికొచ్చినంక వాడికి ఇష్టమైన కిచిడీ, ఖీర్ పూరీ వండిపెడతాను” అని ఉత్తరప్రదేశ్ లోని మోతీపూర్ కు చెందిన ధనపతి అనే మహిళ చెప్పారు. ఇక మీర్జాపూర్ కు చెందిన అఖిలేశ్ సింగ్ ఇంటికి బంధువులందరూ చేరుకున్నారు. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.