మిషన్ హ్యాట్రిక్ . మూడోసారి గెలుపే టార్గెట్​గా బీజేపీ

మిషన్ హ్యాట్రిక్ . మూడోసారి గెలుపే టార్గెట్​గా బీజేపీ
  • ముందస్తు సర్వేల్లో కమలం పార్టీదే పైచేయి
  • ఇప్పటికీ తిరుగులేని నేతగా మోదీ
  • అభివృద్ధే మంత్రంగా క్యాంపెయిన్ షురూ   
  • దూరమైన మిత్రులతో కొత్తగా దోస్తీ 
  • గిరిజన, ముస్లిం, ఇతర వర్గాలపై ఫోకస్
  • విపక్ష కూటమి బలహీనతలపైనా ప్రచారం
  • ఉత్తరాది రాష్ట్రాల్లో ఇబ్బందిలేదన్న ధీమా 
  • దక్షిణాదిలో రాష్ట్రాలవారీగా ప్లాన్ చేంజ్ 
  • సవాలుగా మారిన అంశాలపైనా దృష్టి.

హైదరాబాద్, వెలుగు:  ఇప్పటికే సర్వే ఏజెన్సీల విశ్లేషణల్లో బీజేపీ ముందున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. బలమైన నేతగా మోదీకి ఉన్న ఇమేజే బీజేపీని నిల బెడుతుందని విశ్లేషిస్తున్నారు. తాజాగా వచ్చిన ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ కూడా మోదీ మూడోసారి గెలిచి నెహ్రూ రికార్డును దాటే చాన్స్​ ఉందని అంచనా వేసింది. ఎన్డీయే కూటమి 318 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, విపక్ష కూటమికి 175, ఇతరుల కు 50 సీట్ల వరకు వచ్చే చాన్స్​ ఉందని వెల్లడైంది. ఎన్డీయే కూటమిలోనూ బీజేపీ సొంతంగానే మెజారిటీ మార్క్ దగ్గర ఉంటుందని పోల్ ఫలితాలు చెప్తున్నాయి. మే నెలాఖరులో ఎన్డీటీవీ- సీఎస్డీఎస్ సర్వేలోనూ దాదాపు ఇదే ఫలితం కనిపించింది. 43%  మం ది మోదీనే తర్వాత ప్రధానిగా చెప్పారు. రెండో స్థానంలో ఉన్న రాహుల్ కి 16%  మంది మద్ద తిచ్చారు. పార్టీ పరంగా 39%  మంది బీజేపీకి మద్దతిస్తామని చెప్పారని, ఇది 2019 నాటి బీజేపీ ఓటింగ్ కంటే ఎక్కువని సర్వే విశ్లేషించింది. ఇతర సర్వేల్లోనూ దాదాపుగా ఇవే అంచనాలున్నాయి. 

నమో మంత్రం 

ఎన్డీయేకి, బీజేపీకి ఇప్పటికీ మోదీనే తిరుగులేని శక్తిగా ఉన్నారు. ఆయన పేరు, పాలనే మళ్లీ గెలిపిస్తుందన్న ధీమా మిత్రపక్షాల్లోనూ ఉంది. జులై 18న జరిగిన ఎన్డీయే పక్షాల మీటింగ్​లోనూ ఇదే అంశంపై తీర్మానం చేశారు. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా ఎదిగిన మోదీ నాయకత్వంలో భారీ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి వస్తామని కూటమి ప్రకటించింది.  

అభివృద్ధి ఎజెండా

పాలనలో, పేదల సంక్షేమంలో కేంద్రంపై పూర్తి పాజిటివ్ ఫీలింగ్ జనంలో ఉందని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. మోదీ ఇమేజ్ కు తోడు తొమ్మిదేండ్లలో ప్రభుత్వంపై ఏ అవినీతి ఆరోపణలూ లేవన్నది గుర్తుచేస్తున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలందేలా చేశామని చెబుతున్నారు. గతంలోలాగ పథకాలు పక్కదోవ పట్టకుండా పేదలకు అందేలా చూడడమే ప్రధాన మార్పు అని మోదీ సైతం ప్రతి వేదికపైనా చెబుతున్నారు. ఇదే యూపీ, గుజరాత్​లో వరుస విజయాలకు కారణమన్న విశ్లేషణలున్నాయి.  

పాత మిత్రులే కొత్త దోస్తులు 

మూడో టర్మ్ గెలుపు కోసం బీజేపీ స్ట్రాటజీలోనూ మా ర్పు చేసినట్లుగా ఇటీవలి పరిణామాలను బట్టి అర్థమవుతోంది. జులై 18న ఎన్డీయే మీటింగే ఈ విషయాన్ని బయటపెట్టింది. బీజేపీకి దూరమైన అకాలీదళ్, లోక్ జనశక్తి (పాశ్వాన్), బీహార్ కే చెందిన జీతన్ రామ్ మాంఝీ పార్టీ కూడా భేటీకి హాజరయ్యాయి. దూరమైన పాత మిత్రుల్ని ఒప్పించి కలుపుకోవడం ద్వారా కూటమి బలపడిందన్న సంకేతాలిచ్చారు. మహారాష్ట్రలో శివసేన షిండే గ్రూప్, ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ కొత్తగా ఎన్డీయేలో భాగమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి అనేక కొత్త పార్టీలు చేరాయి.

కొత్త వర్గాలను ఆకర్షించే ప్లాన్

రాజకీయంగా కొన్ని వర్గాలకు బీజేపీ దూరమన్న ము ద్రను పోగొట్టుకోవడానికి ఆ పార్టీ అడుగులు వేస్తోంది. పథకాలు అందరికీ అందేలా చేయడం వల్లే ఇతర వర్గాలతో పాటు గిరిజనులు, కొన్ని ముస్లిం వర్గాలు కూడా గుజరాత్, యూపీలాంటి రాష్ట్రాల్లో బీజేపీకే మద్దతిచ్చాయని, అందుకే భారీ మెజారిటీలు, సీట్లు సాధ్య మయ్యాయని చెబుతున్నారు. యూపీ బీజేపీలో ముస్లింలకు ప్రాతినిధ్యమే లేదన్న విమర్శలకూ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ నుంచి వందల సంఖ్యలో ముస్లిం ప్రతినిధులు గెలిచారు. ముఖ్యంగా ముస్లింలలో బలహీన వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేరళ పర్య టనలో మోదీ పలు ప్రముఖ చర్చి పెద్దలతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. 

ప్రతిపక్ష కూటమిపై ఎదురుదాడి 

గత ఎన్నికల పాఠాలతో ఈ సారి ప్రతిపక్షాలు ఏకమై ఇండియా పేరుతో కొత్త కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో 26 పార్టీలున్నాయి. బీజేపీ పాత మిత్రుడు, బీహార్ సీఎం నీతిశ్ కుమార్ ఈ సారి ప్రతిపక్ష కూట మిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో బీజేపీని బలంగా ఢీకొడతామని ఆ కూటమి నమ్మకంతో ఉంది. అయితే కూటమికి కొత్త పేరు పెట్టుకున్నా అందులో పాత యూపీఏ పక్షాలే ఉన్నాయంటోంది బీజేపీ. ఆ పార్టీలు ఇప్పటికే బలహీనంగా ఉన్నాయని, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే అందులో ఉన్నారంటూ బాగా ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఫేస్ గా రాహుల్ గాంధీ ఉన్నా, ప్రతిపక్షాలను నడిపించే లీడర్ ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. దీనికితోడు అపొజిషన్ పార్టీల మధ్య ఉన్న విభేదాలు కూడా కలిసొస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది. రాహుల్ పాదయాత్ర తర్వాత ఆయన పాపులారిటీ పెరిగిందన్న ప్రచారాన్ని కూడా బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అంత నమ్మకముంటే ప్రతిపక్ష కూటమికి నాయకుడిగా రాహుల్ నే ఎంచుకోవాలని వారు సవాల్ చేస్తున్నారు.    

ఉత్తరాది లెక్కలు

ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీగా, బలమైన ప్రతిపక్షంగా ఉంది. గుజరాత్, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. బెంగాల్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాలతో పాటు ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో ప్రతిపక్షంలో ఉంది. ఉత్తరాదిలో ప్రధానంగా యూపీలో మెజారిటీ ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహాన్ని అమలుచేస్తోంది. దీనికోసం ఈ ఏడాది జనవరిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే బ్లూప్రింట్ ను రెడీ చేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో భారీ సీట్లు సాధించడంతో పాటు కార్పొరేషన్లను స్వీప్ చేసింది. అలాగే కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఇంటింటికీ చేరేలా యాక్షన్ ప్లాన్ ను ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్టీని వీడిన లీడర్లను కలుపుకోవడంతో పాటు బలమైన బీసీ వర్గాల నుంచి లీడర్లకు నాయకత్వం ఇస్తున్నారు. మాఫియా డాన్లు, గూండాల ఎన్ కౌంటర్ ఘటనలు బయటికి సంచలనం అవుతున్నా స్థానికుల్లో మాత్రం పాజిటివ్ ఫీలింగ్ ఉందని లీడర్లు చెబుతున్నారు.  

దక్షిణాదికి ప్లాన్ బీ 

ఉత్తరాదిపై బీజేపీ ధీమాగా ఉన్నప్పటికీ, సౌత్ లో సీట్లు పెంచుకోవడమే ఆ పార్టీకి పెద్ద సవాలని లీడర్లు చెబుతున్నారు. రాష్ట్రాలవారీగా భిన్నమైన భాషలు, రాజకీయం ఉన్న దక్షిణాదిలో కర్నాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఎదిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 129 లోక్ సభ సీట్లు ఉండగా.. బీజేపీ 29 సీట్లే గెలిచింది. వీటిలో కర్నాటకలోనే 25 ఉండగా, తెలంగాణలో 4 సీట్లు ఉన్నాయి. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత ప్రధానంగా తెలంగాణపై పార్టీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మొత్తం మీద సౌత్ లో రాష్ట్రాల వారీగా లాంగ్ టర్మ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు లీడర్లు చెబుతున్నారు. తమిళనాడులో యువ నాయకుడు అన్నామలైకి నాయకత్వం అప్పగించారు. కర్నాటక అసెంబ్లీలో దెబ్బతిన్నా లోక్ సభ ఎన్నికల్లో పుంజుకుంటామని బీజేపీ అంచనా వేస్తోంది. తెలంగాణలోనూ ఈ సారి బీజేపీకి ఎంపీ సీట్లు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఏపీ, కేరళ, తమిళనాడులోనూ ఖాతాలు తెరవాలని బీజేపీ యోచిస్తోంది.       

ఆ 160 సీట్లపై స్పెషల్ ఫోకస్ 

పోయిన సారి బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచిన, చాలా తక్కువ మార్జిన్ తో ఓడిన స్థానాలపైనే ఈ సారి ఆ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇలాంటివి మొత్తం 160 నియోజకవర్గాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ నియోజవర్గాల్లో గెలుపు బాధ్యతలను కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించింది. ఇందులో భాగంగా లోక్ సభ ప్రవాస్ యోజన పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ కూడా చేపట్టింది. అలాగే సోనియా గాంధీ, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, శరద్ పవార్, ఇతర ప్రముఖుల నియోజకవర్గాల్లో, పార్టీ ఎన్నడూ గెలవని సీట్లపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. 

టార్గెట్ .. 350 

2019 ఎన్నికల్లో సొంతంగానే 303 సీట్లు, 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈ సారి 350కిపైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇందుకోసం పార్టీలోని అన్ని వర్గాలను సైమల్టేనియస్ గా రంగంలోకి దింపింది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం మైక్రో మేనేజ్ మెంట్ మోడ్ లోకి వెళ్లింది. ఈ స్ట్రాటజీని పక్కాగా అమలు చేయడం కోసం దేశంలోని రాష్ట్రాలను, యూటీలను నార్త్, ఈస్ట్, సౌత్ అనే మూడు ప్రాంతాలుగా విభజించుకుంది.   

అసలు సవాళ్లు 

పెండింగ్, సవాలుగా మారిన అంశాలపైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఉద్యోగాల కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీల భర్తీని మొదలుపెట్టింది. కొన్నినెలలుగా నెలకు 70 వేలకు పైగా రిక్రూట్ మెంట్లు చేస్తూ అపాయింట్ మెంట్ లెటర్లు అంది స్తున్నారు. ఏడాదిలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు రంగంలోనూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ) వల్ల దేశీయంగా అవకాశాలు పెరిగాయని చెప్తోంది. ఇక పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారిన నిత్యా వసరాల రేట్లు త్వరలోనే అదుపులోకి వస్తాయని అంటోంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నాటికి రేట్లు చాలా వరకు కంట్రోల్ అవుతాయని అధికారులు చెబుతున్నారు. పెట్రో రేట్లను కూడా తగ్గించనున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చింది. ఇక వివాదంగా మారిన అంశాలపై మాత్రం మోదీ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే సివిల్ కోడ్ బిల్లు ఈ సెషన్ లోనే పార్లమెంట్ ముందుకు వస్తుందని ప్రచారం జరిగినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని వాయిదా వేసింది.