టిక్కెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌‌

టిక్కెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌‌

చెన్నై: ఇంగ్లండ్‌‌, ఇండియా మధ్య జరిగే సెకండ్‌‌ టెస్ట్‌‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. ఆన్‌‌లైన్‌‌లో బుక్‌‌ చేసుకున్న వారు.. చిదంబరం స్టేడియం వద్ద ఫిజికల్‌‌ టిక్కెట్లు తీసుకునేందుకు క్యూ కట్టారు. దాదాపు ఆరు గంటల పాటు క్యూలో ఉండి మ్యాచ్‌‌ టిక్కెట్లను తీసుకెళ్లారు. అయితే వేల సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం పరిసరాలు సందడిగా మారిపోయాయి.

కొవిడ్‌‌ రూల్స్‌‌ను మర్చిపోయి, సోషల్‌‌ డిస్టెన్స్‌‌ను వదిలేసి ఫ్యాన్స్‌‌ టిక్కెట్ల కోసం పోటీపడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో తమిళనాడు క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (టీఎన్‌‌సీఏ)పై ఫ్యాన్స్‌‌ గుస్సా అయ్యారు. టిక్కెట్లను ఇచ్చేందుకు సరైన రూల్స్‌‌ను టీఎన్‌‌సీఏ పాటించలేదని విమర్శించారు. అయితే శుక్రవారం కూడా ఫ్యాన్స్‌‌కు టిక్కెట్లు అందజేస్తామని అసోసియేషన్‌‌ తెలిపింది. ఏడాది తర్వాత స్టేట్‌‌లో స్పోర్ట్స్‌‌ ఈవెంట్‌‌ రీస్టార్ట్‌‌ అవుతుండటంతో ఫ్యాన్స్‌‌ కూడా సంతోషం వ్యక్తం చేశారు.