చివరి వన్డేలో భారత్ ఉత్కంఠ విజయం

 చివరి వన్డేలో భారత్ ఉత్కంఠ విజయం
  • చివరి బంతి వరకు పోరాడిన ఇంగ్లండ్
  • టెస్టు,టీ20లతోపాటు వన్డే సిరీస్‌లతో ఇండియా క్లీన్ స్వీప్
  • భారత్ కు చెమటలు పట్టించిన శామ్ కరణ్ 95 నాటౌట్

పుణె: చివరి వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన చివరి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. తొలుత టాప్ ఆర్డర్ కుప్పకూలినా శామ్ కరణ్ చివరి బంతి వరకు పోరాడడంతో ఇంగ్లండ్ గెలుపు అంచుల వరకు వచ్చింది. ఒకరొకరుగా తమ బ్యాట్స్ మెన్ అందరూ చేతులెత్తేస్తున్నా శామ్ కరణ్ మాత్రం పట్టుదలతో ధాటిగా ఆడి భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడి ఇంగ్లండ్ ను విజయతీరాల దగ్గరకు చేర్చాడు. చివరి ఓవర్లో వికెట్ పడడంతో ఇంగ్లండ్ ఆశలు సన్నగిల్లాయి. అయినా శామ్ కరణ్ బరిలో ఉండడంతో విజయం ఇంగ్లండ్ వైపే కనిపించింది. అయితే ఊహించని రీతిలో భారత్ 9వ వికెట్ ను కూల్చి విజయాన్ని కైవసం చేసుకుంది. 
టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ ఇచ్చిన ఇంగ్లండ్
 భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 329 పరుగులు చేసింది. వన్డే సిరీస్ దక్కే కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించింది భారత్. రోహత్ శర్మతో కలసి శిఖర్ ధావన్ బరిలోకి దిగారు. తొలి నాలుగు ఓవర్లు ఆచి తూచి ఆడిన ఓపెనర్లు ఐదో ఓవర్ లో బ్యాట్లు ఝుళిపించి బౌండరీలు కొట్టి రన్ రేట్ పెంచారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని చితక్కొట్టిన ఓపెనర్లు 13 ఓవర్లకు 92 పరుగులు చేయడంతో వన్డేల్లో 5వేల పరుగుల భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. ఇదే ఊపు కొనసాగిస్తున్న దశలో 14.4 ఓవర్ల దగ్గర రషీద్ బౌలింగ్ లో రోహిత్ ఔటయ్యాడు. 37 బంతులాడిన రోహిత్ ఆరు బౌండరీలతో 37 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. దీంతో కెప్టెన్ కోహ్లి మూడో నెంబర్ బ్యాట్స్ మన్ గా బరిలోకి దిగాడు. ఇద్దరూ కలసి ధాటిగా ఆడుతున్నంతలో 16.4 ఓవర్ల వద్ద ఓపెనర్ శిఖ్ ధావన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్ ను కూడా రషీద్ పడగొట్టడంతో ఇంగ్లండ్ టీమ్ ఊపిరి పీల్చుకుంది.56 బంతులాడిన శిఖర్ ధావన్ 10 ఫోర్లు కొట్టి మొత్తం 67 పరుగులు చేశాడు.  తర్వాత ఓవర్లోనే కెప్టెన్ కోహ్లి కూడా 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 17.4 ఓవర్లో మెయిన్ అలీ వేసిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మ్యాచ్ పై పట్టు బిగించేందుకు ఇంగ్లండ్ వ్యూహాలు పన్నడంతో మరో రెండు ఓవర్ల వరకు జట్టు స్కోరు ఏ మాత్రం పెరగలేదు.  అయితే పంత్ వచ్చిరావడంతోనే తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించడం ప్రారంభించాడు. ఓవర్ కు ఒకటి రెండు చొప్పున ఫోర్లు.. సిక్సర్లతో రన్ రేట్ ఏమాత్రం తగ్గకుండా చూశాడు. 24.2 ఓవర్ల వద్ద ఫుల్ టాస్ బంతిని హుక్ చేయబోయిన రాహుల్ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మెయిన్ అలీ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ బాట పట్టాడు. 157 పరుగులు స్కోరు వద్ద కెఎల్ రాహుల్ (7) 4వ బ్యాట్స్ మెన్ గా ఔటయ్యాడు. రాహుల్ స్థానంలో బరిలోకి దిగిన హార్దిక్ తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడుతుండగా.. మరో ఎండ్ లో ఉన్న పంత్ తనదైన శైలిలో ఫోర్లు.. సిక్సులతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 28 ఓవర్లకు 190 పరుగులకు చేరిన సమయంలో హార్దిక్ పాండ్య మెయిన్ అలీ వేసిన ఓవర్లో మూడు సిక్సులతో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. వీరిద్దరి ధాటికి 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. 36 ఓవర్ లో పంత్ (78) కూడా ఔటయ్యాడు. జట్టు స్కోరు 256 పరుగుల వద్ద పంత్ ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు.  తర్వాత బ్యాట్స్ మెన్ కూడా కాస్త ధాటిగా ఆడినా.. 8 పరుగుల తేడాలో చివరి నాలుగు వికెట్లు సమర్పించుకోవడంతో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్ రెండు వికెట్లు, కరన్, స్టోక్స్, టాప్టీ,ఆలీ,లివింగ్ స్టన్ చెరో వికెట్ చొప్పున దక్కించుకున్నారు. 

ధాటిగా ఆరంభించి టపటపా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

330 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టి శుభారంభం చేసింది. అయితే భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ లో జేసన్ రాయ్ 3 ఫోర్లు కొట్టినా అదే ఓవర్లోనే వికెట్ సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లకే ఓపెనర్లిద్దరి వికెట్లు చేజార్జుకుని ప్రమాదంలో పడిపోయింది. తొలి స్పెల్ లోనే రెండు వికెట్లు తీసిన ఊపులో భారత్ ఇంగ్లండ్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించడంతో మ్యాచ్ పై భారత్ పట్టు బిగించింది. అయితే చివర్లో శామ్ కరణ్ భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. విజయం అంచుల దాక తీసుకెళ్లాడు. చివరి ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన మార్క్ వుడ్ రెండో పరుగు కోసం విఫలయత్నం చేసి రనౌట్ అయ్యాడు.  చివరి 3 బంతులకు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో క్రీజులో శామ్ కరణ్ కు తోడుగా టాప్ లే   
వచ్చాడు. శామ్ కరణ్ 95 పరుగులతో నాటౌట్ గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుని ఇంగ్లండ్ ను వైట్ వాష్ చేసింది. 

సచిన్ గంగూలీల సరసన రోహిత్-ధావన్

పుణె: భారత ఓపెనర్లు శిఖర్ ధావన్- రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించారు.  వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వీరు సచిన్ టెండూల్కర్, గంగూలీల జంట సరసన నిలిచారు. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన 3వ వన్డేలో  వీరు ఈ అరుదైన ఫీట్ సాధించారు. ఈ మ్యాచ్ లో వీరు మొత్తం 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వీరు మ్యాచ్ లో చెలరేగి ఆడారు. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్ లు కైవసం చేసుకున్న ధీమాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకునేందుకు దూకుడు ప్రదర్శించారు. తొలుత శిఖర్ ధావన్ ఆచితూచి ఆడగా.. రోహిత్ బౌలర్ల భరతం పట్టాడు. 4 ఓవర్ల తర్వాత శిఖర్ ధావన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బ్రిటీష్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. రోహిత్ 37 బంతుల్లో ఆరు ఫోర్లతో 37 పరుగులు చేసి 100 స్ట్రైక్ రేట్ తో వెనుదిరుగగా.. శిఖర్ ధావన్ 56 బంతుల్లోనే 10 ఫోర్లతో 67 పరుగులు రాబట్టుకున్నాడు. దీంతో వీరి భాగస్వామ్యం మొత్తం 5వేల పరుగుల అరుదైన రికార్డును దాటేసి సచిన్, గంగూలీల సరసన నిలిచారు.