రెండో టీ20 ఇండియాదే

రెండో టీ20 ఇండియాదే
  • 2-0తో సిరీస్‌ సొంతం 
  • 7 వికెట్ల తేడాతో కివీస్​ ఓటమి

రాంచీ: కొత్త కోచ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌.. కొత్త కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ.. ఎదుర్కొన్న తొలి పరీక్షలో సూపర్‌‌ సక్సెస్‌‌ అయ్యారు. అద్భుతమైన బ్యాటింగ్‌‌, అంతకుమించిన బౌలింగ్‌‌తో చెలరేగిన టీమిండియా.. న్యూజిలాండ్‌‌ను మరోసారి కసిదీరా కొట్టింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రోహిత్‌‌ (36 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 5 సిక్సర్లతో 55)కు తోడు వైస్‌‌ కెప్టెన్‌‌ రాహుల్‌‌ (49 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన సెకండ్‌‌ టీ20లో ఇండియా 7 వికెట్ల తేడాతో కివీస్‌‌పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌ 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసింది. గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌ (21 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 34) టాప్‌‌ స్కోరర్‌‌.  గప్టిల్‌‌ (31), డారెల్‌‌ మిచెల్‌‌ (31) ఫర్వాలేదనిపించారు. ఇండియా బౌలర్లలో హర్షల్‌‌ పటేల్‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 17.2 ఓవర్లలో 155/3 స్కోరు చేసి నెగ్గింది. రోహిత్‌‌, రాహుల్‌‌ ఫస్ట్‌‌ వికెట్‌‌కు 117 రన్స్‌‌ చేసి శుభారంభాన్నిచ్చారు. సౌథీ3 వికెట్లు తీశాడు. హర్షల్​ పటేల్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

తలా కొన్ని రన్స్‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌కు వచ్చిన కివీస్‌‌కు క్రీజులోకి వచ్చిన బ్యాటర్లందరూ తలా కొన్ని రన్స్‌‌ జత చేశారు. స్టార్టింగ్‌‌లో ఇండియా బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టిన గప్టిల్‌‌.. భువీ (1/39), చహర్‌‌ బౌలింగ్‌‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. రెండో ఎండ్‌‌లో మిచెల్‌‌ కూడా మెరవడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 26 బాల్స్‌‌లోనే 48 రన్స్‌‌ సమకూర్చారు. తర్వాత వచ్చిన చాప్‌‌మన్‌‌ (21) కూడా వేగంగా ఆడటంతో సెకండ్‌‌ వికెట్‌‌కు 31 రన్స్‌‌ జతయ్యాయి. దీంతో పవర్‌‌ప్లేలో 64/1 ఉన్న స్కోరు ఫస్ట్‌‌ టెన్‌‌లో 84/2కు చేరుకుంది. ఇక్కడి నుంచి ఫిలిప్స్‌‌ జోరందుకున్నాడు. అయితే అవతలివైపు మిచెల్‌‌ ఔట్‌‌ కావడంతో సీఫర్ట్‌‌ (13) క్రీజులోకి వచ్చాడు. ఇతనికి పెద్దగా చాన్స్‌‌ ఇవ్వని ఫిలిప్స్‌‌.. అక్షర్‌‌ (1/26), అశ్విన్‌‌ (1/19)  ఓవర్లలో ఫోర్లతో.. భువీ, చాహర్‌‌ (1/42), హర్షల్‌‌ బౌలింగ్‌‌లో మూడు టవరింగ్‌‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు. నాలుగో వికెట్‌‌కు 35 రన్స్‌‌ జోడించి సీఫర్ట్‌‌ ఔట్‌‌కాగా, కొద్దిసేపటికి ఫిలిప్స్‌‌ను కూడా పెవిలియన్‌‌కు పంపి కివీస్‌‌ స్కోరుకు కళ్లెం వేశారు. లోయర్‌‌ ఆర్డర్‌‌లో నీషమ్‌‌ (3), సాంట్నెర్‌‌ (8 నాటౌట్‌‌), మిల్నే (5 నాటౌట్‌‌) బ్యాట్లు ఝుళిపించకపోవడంతో కివీస్‌‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. 

ఆరంభం.. అదుర్స్‌‌‌‌

పెద్ద టార్గెట్‌‌ కాకపోయినా.. ఇండియా ఛేదనను వేగంగా ఆరంభించింది. ఇన్నింగ్స్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను బౌండ్రీగా మలిచిన రాహుల్‌‌.. రోహిత్‌‌ కంటే స్పీడ్‌‌గా ఆడాడు. సెకండ్‌‌, ఫోర్త్‌‌ ఓవర్​లో మూడు ఫోర్లు కొడితే, మిల్నేకు హిట్‌‌మ్యాన్‌‌ భారీ సిక్సర్‌‌ రుచి చూపించాడు. ఆ వెంటనే బౌల్ట్‌‌ బౌలింగ్‌‌లో రాహుల్‌‌ సిక్స్​ బాదాడు. దీంతో పవర్‌‌ప్లేలో ఇండియా 50/0 స్కోరు చేసింది. తర్వాతి మూడు ఓవర్లలో 18 రన్స్‌‌ వచ్చాయి. కానీ 10వ ఓవర్‌‌ (సాంట్నెర్‌‌)లో రోహిత్‌‌ లాంగాన్‌‌, మిడ్‌‌వికెట్‌‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇదే ఓవర్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను బౌండ్రీ వద్ద బౌల్ట్‌‌ డ్రాప్‌‌ చేశాడు. ఓవరాల్‌‌గా ఫస్ట్‌‌ టెన్‌‌లో టీమిండియా స్కోరు 79/0కు పెరిగింది. తర్వాతి ఓవర్‌‌లో రాహుల్‌‌ 6, 4 కొట్టాడు. 14వ ఓవర్‌‌లో రాహుల్‌‌ భారీ షాట్‌‌కు ట్రై చేసి ఔట్‌‌కావడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 117 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. లైనప్‌‌లో ప్రమోట్‌‌ అయిన వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (12 నాటౌట్‌‌) నిలబడ్డా.. మూడు బాల్స్‌‌ తేడాలో రోహిత్‌‌, సూర్యకుమార్‌‌ (1) పెవిలియన్‌‌కు చేరారు. ఇక137/3 వద్ద వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ (12 నాటౌట్‌‌), వెంకటేశ్‌‌.. 4, 6, 6తో విజయానికి అవసరమైన 17 రన్స్‌‌ అందించారు.