సిరీస్ పట్టాల్సిందే!

సిరీస్ పట్టాల్సిందే!

న్యూజిలాండ్‌‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌‌ గెలిచేందుకు.. టీమిండియాకు మంచి అవకాశం..! గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైన చోట.. చరిత్ర సృష్టించేందుకు విరాటసేనకు మరో గొప్ప తరుణం..! టీ20 వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌లో చోటు కోసం కలలు కనే కుర్రాళ్లకు సత్తా చాటే సమయం..!

మొత్తానికి ఓవైపు జోరు.. మరోవైపు పరువు నేపథ్యంలో ఇండియా, న్యూజిలాండ్‌‌ మధ్య కీలకమైన మూడో టీ20కి రంగం సిద్ధమైంది..! ఇందులో గెలిచి టీమిండియా సిరీస్‌‌ను పట్టేస్తుందా? లేక ప్రత్యర్థులకు చాన్స్‌‌ ఇస్తుందా? చూడాలి..!! హామిల్టన్‌‌:

వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ఇండియా.. న్యూజిలాండ్‌‌ గడ్డపై మరో కీలక సమరానికి సిద్ధమైంది. బుధవారం జరిగే మూడో టీ20లో టీమిండియా.. బ్లాక్‌‌ క్యాప్స్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 2–0 ఆధిక్యంలో ఉన్న విరాట్‌‌సేన ఇక్కడే సిరీస్‌‌ను ముగించాలని పట్టుదలగా కనిపిస్తోంది. 2008–09లో ధోనీ సారథ్యంలోని టీమిండియా 0–2తో సిరీస్‌‌ ఓడగా, గతేడాది కూడా 1–2తో పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో గత చరిత్రను మార్చాలని విరాట్‌‌సేన భావిస్తోంది. దీనికితోడు టీ20 వరల్డ్‌‌కప్‌‌ వరకు సరైన టీమ్‌‌ను ఎంపిక చేసుకోవాలని కూడా టార్గెట్‌‌గా పెట్టుకుంది.

మార్పుల్లేవు!

ఈ మ్యాచ్‌‌ కోసం టీమిండియా ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో పెద్దగా మార్పులు చేసే చాన్స్‌‌ కనిపించడం లేదు. అచొచ్చిన తొలి రెండు మ్యాచ్‌‌ల్లో ఆడిన టీమ్‌‌ను యధావిధిగా దించాలని కోహ్లీ భావిస్తోన్నాడు. అయితే లోయర్‌‌ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌‌ కావాలనుకుంటే సైనీ ప్లేస్‌‌లో శార్దూల్‌‌ వచ్చే అవకాశం ఉంది. ఓపెనింగ్‌‌లో రాహుల్‌‌ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్నా.. రోహిత్‌‌ భారీ ఇన్నింగ్స్‌‌ బాకీ ఉన్నాడు. కోహ్లీ, అయ్యర్‌‌కు తిరుగులేదు. ఈ మ్యాచ్‌‌లోనూ ఈ ఇద్దరు చెలరేగితే సిరీస్‌‌ మనదే. మనీశ్​, దూబే ఫినిషర్లుగా మరోసారి సత్తా చాటాలి. ఆల్‌‌రౌండర్‌‌గా జడేజా బాధ్యత కీలకం కానుంది. పేస్‌‌ బౌలింగ్‌‌ బాధ్యతలను షమీ, బుమ్రాతో పాటు సైనీ, ఠాకూర్‌‌లో ఒకరు పంచుకోనున్నారు. ఏకైక స్పిన్నర్‌‌గా చహల్‌‌ తుది జట్టులో ఉండనున్నాడు. ఫీల్డింగ్‌‌లోనూ మరోసారి మెరిస్తే టీమిండియాకు తిరుగుండదు.

కివీస్​ రేసులోకొచ్చేనా?

మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌‌ను కోల్పోకూడదని కివీస్‌‌ కూడా భారీ ప్లాన్స్‌‌ వేస్తోంది. బౌలింగ్‌‌లో పెద్దగా ఇబ్బందిలేకపోయినా.. బ్యాటింగ్‌‌లో హోమ్‌‌ టీమ్‌‌ తడబడుతోంది. టాప్‌‌–4లో గప్టిల్‌‌, మన్రో, విలియమ్సన్‌‌ మెరుగ్గా ఆడుతున్న స్పెషలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా గ్రాండ్‌‌హోమ్​ నిరాశపరుస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌‌ల్లో అతను 0, 3 రన్స్‌‌ మాత్రమే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌‌ అతనికి చివరి చాన్స్‌‌ కానుంది.  టేలర్‌‌, సీఫర్ట్‌‌ మరింత రాణించాల్సి ఉంది. సీమ్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్లు డారెల్‌‌ మిచెల్‌‌, స్కాట్‌‌ కుగెలిన్‌‌ ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో రావొచ్చు.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, రాహుల్‌‌, శ్రేయస్‌‌, మనీశ్​, దూబే, జడేజా, ఠాకూర్‌‌ / సైనీ, చహల్‌‌, షమీ, బుమ్రా.

న్యూజిలాండ్‌‌: విలియమ్సన్‌‌ (కెప్టెన్‌‌), గప్టిల్‌‌, మన్రో, గ్రాండ్‌‌హోమ్​, టేలర్‌‌, సీఫర్ట్‌‌, శాంట్నర్‌‌ / మిచెల్‌‌, సోధీ, సౌథీ, టిక్నర్‌‌ / స్కాట్‌‌, కుగెలిన్‌‌, బెనెట్‌‌.

పిచ్‌‌, వాతావరణం వికెట్​ బ్యాటింగ్‌‌కు అనుకూలం. హైస్కోరింగ్‌‌ మ్యాచ్‌‌ ఆశించొచ్చు. వర్షం ముప్పులేదు.

వాళ్లిద్దరూ మ్యాచ్ విన్నర్లు

ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్‌‌కప్ ఆడే జట్టులో ఎవరు ఉంటారనేదానిపై ఇప్పటికే ఓ అవగాహన ఉంది. గాయం, ఫామ్‌‌ కోల్పోవడం లాంటి కారణాలు ఉంటే తప్ప టీమ్‌‌లో మార్పులుండవు. అయితే చివరి నిమిషం దాకా ప్రయోగాలు చేస్తాం. నేటి తరం క్రికెటర్లను చూస్తే అద్భుతం అనిపిస్తుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా అందరూ తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ముఖ్యంగా కేఎల్‌‌ రాహుల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ జట్టులో మ్యాచ్‌‌ విన్నర్లు. జూనియర్‌‌ లెవెల్‌‌ నుంచి వాళ్లిద్దరూ నాకు తెలుసు. వాళ్లకిప్పుడూ చాన్స్‌‌ దొరికింది. అందుకే తామేంటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అయ్యర్‌‌ తనని తాను ఓ బిగ్‌‌ ప్లేయర్‌‌ అనుకుంటాడు. ఆ మైండ్‌‌సెట్‌‌ వల్లే అతను మ్యాచ్‌‌ విన్నర్‌‌గా ఎదుగుతున్నాడు.