ఆసియా కప్ టైటిల్ ఫైట్‌‌.. పాకిస్తాన్‌‌తో ఇండియా అమీతుమీ.. పాక్ ఆశలన్నీ ఇద్దరి పైనే..!

ఆసియా కప్ టైటిల్ ఫైట్‌‌.. పాకిస్తాన్‌‌తో ఇండియా అమీతుమీ.. పాక్ ఆశలన్నీ ఇద్దరి పైనే..!

దుబాయ్: యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. వివాదాలు, ఉద్రిక్తతల నడుమ సాగుతున్న ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థులైన  ఇండియా, పాకిస్తాన్ టైటిల్ కోసం ఢీకొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఎడిషన్‌‌లో దాయాది జట్లు మూడోసారి తలపడనున్నాయి.

టోర్నీలో అజేయంగా నిలిచిన టీమిండియా ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతుండగా, తడబడుతూ ఫైనల్ చేరిన పాక్‌‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా, టోర్నీ ఆరంభం నుంచి మైదానం బయట నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, వివాదాల నడుమ జరుగుతున్న ఈ మ్యాచ్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది కేవలం ఆట కాదు ‘యుద్ధం మినహా అన్నీ’ అనే రీతిలో వాతావరణం వేడెక్కింది. అయితే, ఎలా గెలిచినా అంతిమంగా విజయం మాత్రమే ముఖ్యమని ఇరు జట్లు భావిస్తున్నాయి. తమ బద్ధ శత్రువు పాక్‌‌ను మూడోసారి ఓడించి ఆసియా కప్‌‌ను కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది.

అభికి తోడు ఆ ఇద్దరూ ఆడితేనే..
ఈ టోర్నీలో టీమిండియా ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఆడిన ఆరు మ్యాచ్‌‌లలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగించింది. శ్రీలంకతో గత పోరులో బుమ్రా, దూబే లేకుండా ఆడినా సూపర్ ఓవర్లో గెలిచి ఫైనల్‌‌కు ముందు మరింత జోష్ పెంచుకుంది.  జట్టు విజయాల్లో యంగ్‌‌ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరు మ్యాచ్‌‌ల్లో 309 రన్స్‌‌తో టోర్నీ టాప్ స్కోరర్‌‌‌‌గా ఉన్న అతను 200 ప్లస్ స్ట్రయిక్ రేట్‌‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే జట్టు మొత్తం అతనిపైనే ఆధారపడటం ఆందోళన కలిగించే విషయం. అభిషేక్ తర్వాత తిలక్ వర్మ (144 రన్స్‌‌) టాప్ స్కోరర్‌‌గా ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌‌మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు ఇంకా స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్  చేయలేదు. ఒకవేళ ఫైనల్‌‌లో అభిషేక్ ఫెయిలైతే మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంది.

గత మ్యాచ్‌‌లో తిలక్‌‌, శాంసన్ ఆ పని చేసినప్పటికీ.. సూర్యకుమార్ ఆఖరాటలో అయినా తన మార్కు చూపెట్టాల్సిందే. కెప్టెన్‌‌గా సూర్య అద్భుతంగా రాణిస్తున్నా, బ్యాటర్‌‌గా మాత్రం తేలిపోతున్నాడు. ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌‌ల్లో  కేవలం 110 స్ట్రయిక్ రేట్‌‌తో 99 రన్స్‌‌ మాత్రమే చేశాడు. అతని డాట్ బాల్ శాతం 35 నుంచి 48 శాతానికి పెరిగింది. ప్రత్యర్థి బౌలర్లు అతనికి ఔట్ సైడ్  ఆఫ్‌‌ స్టంప్ వైడ్ యార్కర్లు వేస్తూ కట్టడి చేస్తున్నారు.

ఈ ఫైనల్లో కెప్టెన్ సూర్య కాకుండా, బ్యాటర్ సూర్యగా తన విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు లంకతో పోరులో ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయం, అభిషేక్‌‌కు నరాలు పట్టేడయం వంటివి జట్టును కలవరపెడుతున్నాయి. అయితే అభిషేక్ కోలుకున్నాడని, హార్దిక్ పరిస్థితిని మ్యాచ్ ముందు అంచనా వేస్తామని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. లంకతో పోరులో రెస్ట్ తీసుకున్న  పేస్ లీడర్ బుమ్రా, ఆల్‌‌రౌండర్ దూబే తమ మార్కు చూపెడితే జట్టుకు తిరుగుండదు.

పాక్‌‌ ఏం చేస్తుందో ?
ఇండియా అజేయంగా ఆఖరాటకు రెడీ అయితే.. పాక్‌‌ ఫైనల్ చేరడానికి చాలా కష్టపడింది. బంగ్లాదేశ్‌‌పై గెలిచినప్పటికీ ఆ టీమ్‌‌ ఆట అంతంత మాత్రంగానే ఉంది. కానీ, పాక్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం. ఇప్పటికే రెండుసార్లు ఇండియా చేతిలో దెబ్బతిని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న  ఆ జట్టు సూర్యసేనకు ఫైనల్ పంచ్‌‌ ఇవ్వాలని చాలా కసిగా ఉంది. ప్రస్తుతం ఇరు జట్ల బలాబలాలు చూస్తే అది అనుకున్నంత సులువు కాబోదు.

పాక్‌‌ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా బలహీనంగా ఉంది. సాహిబ్జదా ఫర్హాన్ మినహా ఎవరూ నిలకడగా రాణించడంలేదు. ఓపెనర్ సైమ్‌‌ అయూబ్ నాలుగు సార్లు డకౌట్ అయి ఘోరంగా విఫలమయ్యాడు. హుస్సేన్ తలత్, కెప్టెన్ సల్మాన్ అలీ ఇండియా స్పిన్నర్ల ధాటికి నిలవలేకపోయారు. ఈ క్రమంలో పాక్‌‌ తమ ఆశలన్నీ తమ పేస్ ద్వయం షాహీన్ షా ఆఫ్రిది, హారిస్ రవూఫ్‌‌పైనే పెట్టుకుంది. వీరిద్దరూ ఆరంభంలోనే ఇండియా టాపార్డర్‌‌ను దెబ్బతీస్తే, మ్యాచ్ రసవత్తరంగా మారవచ్చు. కానీ, వారికి ఇతర బౌలర్ల నుంచి సహకారం కొరవడింది. 

పిచ్/ వాతావరణం
ఫైనల్ కోసం కొత్త వికెట్‌‌ను ఉపయోగిస్తున్నారు. ఇది స్పిన్ బౌలింగ్ మొగ్గు చూపే చాన్సుంది. రాత్రి పూట మంచు ప్రభావం దృష్ట్యా.. టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్‌‌కు మొగ్గు చూపొచ్చు.

తుది జట్లు (అంచనా)

  • ఇండియా: అభిషేక్,  గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, శాంసన్ ( కీపర్), దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్‌‌,  బుమ్రా, చక్రవర్తి.
  • పాకిస్తాన్‌‌: సాహిబ్జదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్, తలత్, నవాజ్, సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్,  హారిస్ (కీపర్), షాహీన్ షా, రవూఫ్, అబ్రార్.